రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
జామి: మండలంలోని యాతపాలెం సమీపంలో రైలులో నుంచి జారిపడడంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన మనోజ్ తివారి(40) రైలులో ప్రయాణిస్తూ జారిపడి తీవ్ర గాయాల పాలవడంతో స్ధానికులు 108కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు.
హోంగార్డు మృతి
వంగర: మండల పరిధి మగ్గూరు సమీపంలోని మడ్డువలస ప్రాజెక్టు డైక్ వద్ద శివ్వాం గ్రామానికి చెందిన హోంగార్డు పొదిలాపు అప్పలనాయుడు(53) మృతిచెందినట్లు ఏఎస్సై సూర్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అప్పలనాయుడు స్వగ్రామం శివ్వాం వచ్చి ఈనెల 2వ తేదీన ఇంటి నుంచి విధులకు హాజరయ్యేందుకు బయల్దేరాడు. ఆదివారం ఉదయం మగ్గూరు సమీపంలో మడ్డువలస ప్రాజెక్టు డైక్‌ను ఆనుకుని హోంగార్డు మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారని ఏఎస్సై తెలిపారు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని మృతుడి భార్య భారతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పాముకాటుతో రైతు మృతి
సాలూరు రూరల్: మండలంలోని శివరాంపురం గ్రామానికి చెందిన రైతు అల్లు రమేష్ (32) ఆదివారం మధ్యాహ్నం వరి పొలంలో చేను కోస్తుండగా పాముకాటుకు గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కూలీలతో పాటు రమేష్ పొలంలో వరిచేను కోస్తుండగా పాము కాటువేయడంతో వెంటనే ద్విచక్రవాహనంపై సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
మెంటాడ: మండలంలోని కొంపంగి బ్రిడ్జి వద్ద కాపుకాసి 20 బస్తాలు (సుమారు 900కేజీలు) బియ్యంతో ప్రయాణిస్తున్న ఆటోను పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్సై సీతారాం తెలియజేశారు. ముందస్తు సమాచారంతో పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
దళారులకు ధాన్యం విక్రయం
బలిజిపేట: ఖరీఫ్ వరిపంట కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం విక్రయాల కోసం అన్నదాతలు దాళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.2300 మద్దతు ధర ప్రకటించగా దళారులు రూ.1800లకు కొనుగోలు చేస్తున్నారు. తూకంలో తేడాలతో రైతులు మోసపోతున్నారు. 80 కిలోల బస్తాకు 4 కిలోలు చొప్పున ధాన్యాన్ని అదనంగా రైతుల నుంచి దళారులు తీసుకుంటున్నారు. కళ్లాల్లో ధాన్యం బస్తాలు నిల్వ చేయలేక, వాతావరణ పరిస్థితులకు భయపడి దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment