పైడితల్లిని దర్శించుకున్న రైల్వే ఐజీ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దై వం పైడితల్లి అమ్మవారిని రైల్వే (భువనేశ్వర్) ఐజీ భవానీనాథ్‌శంకర్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు అమ్మవారి శేషవస్త్రాలను, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే పోలీస్ అధికారులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగ పోరాటం తప్పదు
గజపతినగరం: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అర్ధ సంవత్సరం కావస్తున్నా ప్రభు త్వ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్‌పై ఎలాంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని, రానున్న రోజుల్లో ఉద్యోగ పోరాటం తప్పదని ఎస్జీటీ (సెకెండరీ గ్రేడ్ టీచర్స్) ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.చంద్రరావు హెచ్చరించారు. గజపతినగరం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన సోమవారం మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమినాయకులు ఇచ్చిన హామీలను నమ్మి మద్దతు తెలిపామని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
వర్సిటీ అభివృద్ధే లక్ష్యం
● జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి వీసీ
రాజ్యలక్ష్మి
విజయనగరం అర్బన్: యూనివర్సిటీ అభివృద్ధే లక్ష్యమని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో వర్సిటీ పేరు ఇనుమడింపజేసేలా ప్రతి ఒ క్కరూ పనిచేయాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. యూనివర్సిటీ సమావేశ మందిరంలో వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సోమవా రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ను బోధించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఉజ్వల భవితను అందించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ మాట్లాడుతూ సమష్టి కృషితో బాధ్యతగా పనిచేస్తే ప్రమాణాలతో కూడిన విద్యను అందించవచ్చన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, జాస్తి ఆనంద్ చందూలాల్, వర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
తహసీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం అర్బన్: జిల్లాలో ఫ్రీ హోల్డ్ భూములపై ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సరిగా అందించని తహసీల్దార్లపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మండిపడ్డారు. ఒకే అంశంపై పొంతన లేకుండా వివిధ రకాల గణాంకాలతో కూడిన నివేదికలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రెవె న్యూ అంశాలపై జిల్లాలోని ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో జేసీతో కలిసి సమీక్షించారు. ఫ్రీహోల్డ్ భూములపై వాస్తవ సమాచారం అందించని మండల స్థాయి రెవె న్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం నాటికి సరైన నివేదికలు అందించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment