గిరిజన వర్సిటీని త్వరగా పూర్తి చేయాలి
● మంత్రి లోకేష్ ప్రకటన విరమించుకోవాలి
● ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన
కార్యదర్శి అజశర్మ
విజయనగరం పూల్‌బాగ్/మెంటాడ : గిరిజన యూనివర్సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గిరిజన యూనివర్సిటీని కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మారుస్తామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విరమించుకోవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మెంటాడ మండలంలోని కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం విజయనగరంలోని ఎన్‌పీఅర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ నిర్మాణం లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీని స్థలాన్ని మార్చడంతో నేటికీ కుంటినవలస వద్ద వర్సిటీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఉందన్నారు. నేడు మళ్లీ దీన్ని కొత్తవలస మండలంలో రెల్లి వద్ద అప్పుడు సేకరించిన స్థలంలోనే నిర్మిస్తామని ఈ నెల 13 న రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు.
ప్రతిసారీ మార్చడం అవివేకం
మత్రి ప్రకటిన వల్ల వర్సిటీ నిర్మాణం మరింత ఆలస్యమవుతుంది తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం రెల్లి నుంచి ఇక్కడికి మార్చిందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా స్థలాలు మార్చుకోవడం భావ్యం కాదని హితవు పలికారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న దీనిని మార్చడం అంటే అవివేకం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.
గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించాలి
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కేంద్ర విద్యా శాఖ మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకే మాత్రం జాప్యం చేయకుండా మెంటాడలోనే దీనిని నిర్మించాలని లేఖలు రాశామన్నారు. గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధత ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో కోరినట్లు తెలిపారు. బుధవారం తమ బృందం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్‌ను కలిసి చర్చించినట్లు చెప్పారు. ఎస్టీ అసెంబ్లీ నియోజక వర్గం సాలూరులో భాగంగా ఉన్న మెంటాడ మండలంలోని కుంటినివలస గ్రామం వద్ద దీని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన 2025 లోగా పూర్తి చేయాలని, శాశ్వత సిబ్బందిని నియమించి, అన్ని కోర్సులను అందుబాటులోకి తేవాలని, గిరిజనులకు 50శాతం సీట్లు కేటాయించేలా చట్టబద్ధ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ వాసా, ఉపాధ్యక్షురాలు కె. విజయ గౌరి, గిరిజన సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి టి. సోములు, మన్యం జిల్లా కార్యదర్శి సీదిరి అప్పారావు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాము, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాము, జగదీష్, రవికుమార్, కాంతారావు, గ్రామ సర్పంచ్ రమేష్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment