పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలి
● బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ అప్పారావు
విజయనగరం ఫోర్ట్: పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. ఈ మేరకు బాలల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. బాలికలు చెడు స్నేహాలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేఽశించుకుని దాన్ని సాధించడానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులపై తల్లిదండ్రులకంటే ఉపాధ్యాయలకు బాధ్యత ఎక్కువని స్పష్టం చేశారు. బాలికల విద్యాభివృధ్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ పండిట్ జవహర్‌లాల్ పుట్టిన రోజు నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామని, గతంలో బాలలకు హక్కులు గురించి చెప్పేవారు ఉండేవారు కాదన్నారు. నేడు బాలల హక్కులు గురించే తెలియజేసే అనేక సంస్థలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని, సాంకేతికతను మంచికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. చదువుపై విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం శిశు గృహ వారు ఊయల కార్యక్రమంపై రుపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ వివిధ క్రీడా పోటీల్లో రాణించిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ హిమబిందు, సభ్యులు చిట్టిబాబు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు, శిశు గృహ మేనేజర్ త్రివేణి, పీఓఐసీ బి.రామకోటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment