మత్స్యకారులకు నిరాశే..!
పూసపాటిరేగ: సముద్రమే వారికి సర్వస్వం. పొద్దుపొడవక ముందే బోట్లపై వలలు సర్దుకుని ప్రాణాలకు తెగించి సంద్రంలోకి వెళ్తారు. చేపల వేట సాగిస్తారు. ఆ రోజు వలకు చేపలు చిక్కితే పండగే. లేదంటే నిరాశే. జీవనానికి ఇబ్బందులు తప్పవు. అలాంటి దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులపై టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్నచూపుచూస్తోంది. అధికారంలోకి వచ్చి అర్ధసంవత్సరం అవుతున్నా వేట నిషేధ భృతి(మత్స్యకార భరోసా) అందజేయకపోవడంతో గంగపుత్రులు ఆవేదన చెందుతున్నారు. కనీసం మత్స్యకార దినోత్సవం నాటికి అయినా భరోసా మంజూరవుతుందని ఆశించినా నిరాశే మిగిలిందంటూ వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, బోగాపురం మండలాలులో 19 మత్స్యకార గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో సుమారు 5 వేల మందికి చేపలవేటే ప్రధాన వృత్తి. వీరిపై పరోక్షంగా మరో 16 వేలు మంది ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికంగా 885 బోట్లలో 3,798 మంది మత్స్యకారులు నిత్యం వేటను సాగిస్తుండగా, మరికొంత మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వివిధ కంపెనీల ఆధ్వర్యంలో వేట సాగిస్తున్నారు. పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, నీలగెడ్డపేట, చింతపల్లిబర్రిపేట, చింతపల్లిపెద్దూరు, కొత్తూరు, పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డు వెంకటేషుపేట, భోగాపురం మండలంలో చేపలుకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చినకొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం తదితర గ్రామాల ప్రజలకు వేటే జీవనాధారం. వాతావరణంలో మార్పులు కారణంగా ఇటీవలకాలంలో చేపలు వేటలేక ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు రూ.23 కోట్ల ఖర్చుతో చింతపల్లిలో జెట్టీ మంజూరు చేసినా.. ప్రస్తుత కూటమి సర్కారు జెట్టీ నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా.. పిట్ ఆంధ్రా యూనిట్లు మంజూరు చేసి మత్స్యకారులకు ఉపాధి కల్పించిందని, డీజిల్ రాయితీలు అందజేసి అండగా నిలిచిందని, ప్రస్తుతం అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటీ అమలుకావడంలేదంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మత్స్యకార దినోత్సవం వచ్చినా
ఉత్సాహం కరువు
గంగపుత్రులపై టీడీపీ కూటమి ప్రభుత్వం చిన్నచూపు
అధికారంలోకి వచ్చి అర్ధసంవత్సరం అవుతున్నా అందని భరోసా
వరుస తుఫాన్లు, అటుపోట్లతో సాగని వేట
ఆర్థిక ఇబ్బందుల్లో మత్స్యకారులు
మత్స్యకారులకు గడ్డుపరిస్థితి
టీడీపీ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించింది. గడ్డు కాలం ఎదురైంది. వేట నిషేధ భృతి అందజేయకవపోడం దారుణం. చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి శంకుస్థాపన చేసిన జెట్టీ నిర్మాణంపై కూడా నిర్లక్ష్యం చేస్తోంది. మత్స్యకార దినోత్సవం రోజున మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం విచారకరం.
– బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం
జీవనానికి ఇబ్బందులు
నిత్యం చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు తుఫాన్లతో వేట సక్రమంగా సాగడంలేదు. ప్రభుత్వం కూడా ఆదుకోవడంలేదు. కనీసం వేట నిషేధ కాలానికి భృతికూడా చెల్లించలేదు. జీవనానికి ఇబ్బందులు పడుతున్నాం.
– రాయితి బుచ్చోడు, మత్స్యకారుడు,
తిప్పలవలస
Comments
Please login to add a commentAdd a comment