350 కిలోల నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు స్వాధీనం
విజయనగరం: విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై దాడులు నిర్వహించిన ప్రజారోగ్య విభాగ బృందం 350 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో పీడబ్ల్యూ మార్కెట్లో వివిధ ప్లాస్టిక్ విక్రయాల దుకాణాలపై దాడులు నిర్వహించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ప్లాస్టిక్ విక్రయదారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఈ మధ్యనే 560 కేజీల ప్లాస్టిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, మళ్లీ పీడబ్ల్యూ మార్కెట్లో కొందరు నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టామన్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టిక్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అలాగే ప్రజలు కూడా క్యారీ బ్యాగులు కాకుండా కాటన్ సంచులు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు సాగిస్తే భారీ అపరాధ రుసుములతో పాటు దుకాణాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు, మేసీ్త్రలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment