పత్తి రైతుకు దళారులే దిక్కు
రాజాం: తెల్ల బంగారంగా పేరున్న పత్తి పంటను సాగుచేసిన రైతన్నకు కష్టకాలం వచ్చింది. పత్తి పంట చేతికందినా స్థానికంగా విక్రయించుకోలేని దుస్థితి. రాజాంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం, రామభద్రపురం మండలం ముచ్చెర్లవలసలో ఉన్న కొనుగోలు కేంద్రం దూరం కావడంతో రైతులు క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు.
● తగ్గిన సాగు
గత ఖరీఫ్‌లో జిల్లాలో 1833 హెక్టార్లలో పత్తిపంట సాగు చేయగా, ఈ ఏడాది 1777 హెక్టార్లలో 3,400 మంది రైతులు పంటను సాగుచేసినట్టు వ్యవసాయ రికార్డులు చెబుతున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2024–25 సీజన్‌కు గాను పత్తి పంట క్వింటాకు రూ.7,521లు మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధరను పొందాలంటే ఈ క్రాప్‌లో రైతుల పేరు నమోదై ఉండాలి. తేమశాతం ఆధారంగా మద్దతు ధర అందుతుంది. తేమశాతం 8 శాతం మాత్రమే ఉండాలి. అంతకుమించి ఉంటే ధర తగ్గుతుంది. 12 శాతం దాటితే కొనుగోలు చేయరు. పత్తి పిందె పొడవు 29.50 ఎమ్‌ఎమ్ నుంచి 30.50 ఎమ్‌ఎమ్ వరకు ఉండాలి. ఈ నిబంధనలతో రైతులు సుదూరంగా ఉండే కొనుగోలు కేంద్రానికి పత్తిని తరలించేందుకు ఆసక్తిచూపడంలేదు. వచ్చిన ధరకు ఇంటివద్ద దళారులకే విక్రయించి నష్టపోతున్నారు.
నాణ్యతే ప్రామాణికం
పత్తి పంటలో ప్రధానంగా నాణ్యతను ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ప్రస్తుతం పండిస్తున్న పత్తిపంట మొదటి పూత నాణ్యతగా ఉంటుంది. పత్తికాయలు పెద్దవిగా రావడంతో పాటు పత్తి కూడా తెల్లగా ఎటువంటి పుప్పులేకుండా దిగుబడి వస్తుంది. పత్తిని సేకరించిన రైతులు ఇంటి వద్ద ఎండబెట్టి, గోనెసంచుల్లో సిద్ధం చేస్తున్నారు. వీటిని టన్నుల్లో వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డులో పత్తికొనుగోలు కేంద్రం సిద్ధం చేసినా కొనుగోలు చేయడం లేదు. రామభద్రపురం జిన్నింగ్ మిల్లుకు పంపిస్తున్నాం.
– కె.శ్రీనివాసరావు,
రాజాం ఏఎమ్‌సీ కార్యదర్శి
రాజాంలో ప్రారంభంకాని కొనుగోలు
కేంద్రం
రైతన్నకు దక్కని మద్దతు ధర
క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు నష్టపోతున్న రైతులు
దళారీలకు విక్రయిస్తున్నాం..
పత్తి పంట ఒకే దఫా కోతకు రాదు. నాలుగు నుంచి ఆరు పూతలు వస్తాయి. తొలి, మలి పూత దశల్లో వచ్చిన పత్తికాయలు నాణ్యంగా ఉంటాయి. వీటికే మంచి ధర ఉంటుంది. రాజాంలో పత్తి కొనుగోలు కేంద్రం ఉన్నా, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. మాకు ఇక్కడ మద్దతుధర లేదు. – కె.అప్పలనాయుడు,
పత్తిరైతు, అమరాం, రాజాం మండలం
దిగుబడి తగ్గింది
ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గింది. స్థానికంగా కొనుగోలు కేంద్రం లేకపోవడంతో విక్రయానికి ఇబ్బందులు తప్పడంలేదు. ఇతర ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండడంతో పంటను తరలిస్తున్నాం.
– లావేటి రమణ, గడిముడిదాం,
రాజాం మండలం
Comments
Please login to add a commentAdd a comment