రసీదు తీసుకుని ఇసుక తీసుకెళ్లండి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: జిల్లాలో 48 ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రీచ్‌కు పంచాయతీ కార్యదర్శిని ఇన్‌చార్జిగా నియమించామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇసుక కావలసిన వారు పంచాయతీ కార్యదర్శి యాప్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు రసీదును తీసుకున్నాక ట్రాక్టర్, ఎడ్ల బండ్లపై ఉచితంగా ఇసుక తరలించాలన్నారు. పోలీసులకు రసీదు చూపిస్తే వదిలేస్తారని తెలిపారు. తన చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేగిడి ఆమదాలవలస మండలం కె.వెంకటాపురం వద్ద 72 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను మాన్యువల్‌గా తవ్వేందుకు కొత్త రీచ్‌కు అనుమతి లభించిందని, త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. డెంకాడ వద్ద స్టాక్ పాయింట్‌ను శనివారం నుంచి తెరుస్తామన్నారు. వంగర మండలం కొండచాకరాపల్లి వద్ద ఇసుక తవ్వడం వల్ల రహదారులు దెబ్బ తింటున్నాయని నారాయణపురం గ్రామస్తులు అసంతృప్తిగా ఉన్నారని తహసీల్దార్ తెలుపగా, క్వారీ అనంతరం రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడానికి కమిటీలో ఫైల్ పెట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సత్యలత, రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్, ఆర్డీఓ కీర్తి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, పీసీసీబీ ఈఈ సరిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కవిత, గనులశాఖ ఐటీ తులసీరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కళ్లాల వద్దే కూపన్లు ఇవ్వాలి
● జేసీ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నూర్పిడి చేసిన కళ్లం వద్దనే రైతులకు కూపన్ ఇచ్చి ధాన్యం సేకరించాలని రెవెన్యూ, వ్యవసాయ అధికారులను జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను అన్ని మండలాల్లో వెంటనే ప్రారంభించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, సహకార అధికారులు, సీఎస్‌డీటీలతో ధాన్యం సేకరణ ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. ఇదే ఆఖరి సమావేశమని క్షేత్రస్థాయిలో రేపట్నుంచి ఎవరిపని వారు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే ఫోన్‌లో తెలియజేయాలన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలుపై కస్టోడియన్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి చేయవలసిన పనులపై శిక్షణ ఇచ్చారు. ధాన్యం తరలించే వాహనానికి జీపీఎస్ పరికరం అమర్చుతామని, పొరపాటున దారిమళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం తరలింపును కస్టోడియన్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ మీనాకుమార్, డీఎస్‌ఓ మధుసూదనరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తారక రామారావు, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment