వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కోటవద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వలంటీర్లు
అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లకు నెలకు రూ.10వేలు చెల్లిస్తాం.. సమాజంలో గౌరవం, గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు చెప్పారని, ఇప్పుడు వలంటీర్ వ్యవస్థే లేదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నా మిన్నకుండడంపై వలంటీర్లు మండిపడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుపై శుక్రవారం విజయనగరం కోట, గంటస్తంభం సాక్షిగా ఆందోళనకు దిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సీఎం గారూ అంటూ నినదించారు. రాష్ట్రంలో 2 లక్షల 60వేల మంది వలంటీర్లం ఉన్నామని, మోసం చేస్తే బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలో ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ వలంటీర్ వ్యవస్థే లేదని చెబుతున్న మంత్రులు... అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు ఇచ్చిన వేతనంలో రూ.200 పేపర్ బిల్లు
ఎందుకు కటింగ్ చేశారని ధ్వజమెత్తారు. రాజీనామా చేసిన వలంటీర్ల కోసం ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. జూన్, జూలై నెలలో వలంటీర్లును కొనసాగిస్తామని, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని విభజన చేస్తామని అబద్ధాలు ఎందుకు చెప్పారంటూ మండిపడ్డారు. అధికారం కోసం వలంటీర్లు మనోభావాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. భవిష్యత్తులో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గడ్డుపరిస్థితి తప్పదని హెచ్చరించారు.
– విజయనగరం పూల్‌బాగ్
Comments
Please login to add a commentAdd a comment