నేడు శంబర పెదపోలమాంబ అమ్మవారి చాటింపు
● 30న గ్రామానికి చేరుకోనున్న పెదపోలమాంబ ● వచ్చే ఏడాది జనవరి 27, 28, 29 తేదీలలో అమ్మవారి జాతర
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారు సనప చాటింపు సోమవారం జరగనుంది. సోమవారం నుంచి శంబర గ్రామంలో పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం కానుంది. ఆనవాయితీ ప్రకారం సోమవారం గ్రామస్తులంతా సమావేశమై, పెద్ద అమ్మవారిని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు సనప చాటింపు వేస్తారు.
30న పెద్ద అమ్మవారిని కొనితెచ్చుట
శంబర గ్రామం నుంచి ఎస్.పెద్దవలస గ్రామానికి వెళ్లే రహదారి వద్ద పూజలు నిర్వహించి, పోలమాంబ మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని ఈ నెల 30వ తేదీన గ్రామంలోని పెద్ద అమ్మవారి ఆలయంలోకి భాజాభజింత్రుల నడుమ అమ్మవారిని తీసుకువస్తారు. అమ్మ వారు గ్రామంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 6న తొలేళ్ల ఉత్సవం, 7న పెద్ద పండగ, 8న అనుపోత్సవం నిర్వహిస్తారు.
జనవరి 8న పోలమాంబ అమ్మవారిని కొనితెచ్చేందుకు చాటింపు
వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన పెదపోలమాంబ అమ్మవారిని అనుపోత్సవం నిర్వహించిన అనంతరం శంబర పోలమాంబ అమ్మవారిని కొని తెచ్చేందుకు గ్రామంలో చాటింపు వేస్తారు. జనవరి 13వ తేదీన గోముఖీ నది ఒడ్డున పూజలు నిర్వహించి, పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 14వ తేదీన అమ్మవారు చదురుగుడిలో విశాంత్రి తీసుకొని, 13 రోజుల పాటు గ్రామంలోని చదురుగుడిలో భక్తులకు దర్శనమిస్తూ, సాయంత్రం వేళల్లో గ్రామంలో తిరువీధి నిర్వహిస్తారు. జనవరి 27వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 28న సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment