క్రీడలతో మానసికోల్లాసం
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్‌స్థాయి గురుకుల క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని పదకొండు గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరై క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఒక్కో పాఠశాల నుంచి 85 మంది విద్యార్థులు హాజరుకాగా, మొత్తంగా 935 మంది క్రీడల్లో పాల్గొంటున్నారు. అండర్–14, అండర్–17, అండర్–19లో అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ ఇలా 33 క్రీడలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయన్నారు. చదువులోనే కాకుండా ఇలా క్రీడల్లో పాల్గొనడం ద్వారా శరీర దృడత్వం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పాఠశాలకు అదనంగా ఐదు ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, మల్టీజోనల్ ఆఫీసర్ రజని, బుద్దారం కళాశాల ప్రిన్సిపల్ ఆరోగ్య పాల్గొన్నారు.
జోనల్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment