ముందస్తు ప్రణాళికలు
కొల్లాపూర్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై మిషన్ భగీరథ అధికారులు దృష్టి సారించారు. కొన్నేళ్లుగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణానదిలో భారీగా నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో అవసరమయ్యే తాగునీటి వనరులపై పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కేఎల్‌ఐ నుంచి 84 మండలాలకు..
కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కేఎల్‌ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటుచేశారు. ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ. 5,478 కోట్ల వ్యయంతో పంప్‌హౌజ్‌లు, పైప్‌లైన్లు, వాటర్‌ట్యాంకులు ఏర్పాటుచేశారు. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో రూ. 120 కోట్ల వ్యయంతో ఫిల్టర్‌బెడ్స్ నిర్మించారు. ఇక్కడి నుంచే అన్ని నియోజకవర్గాలకు రక్షిత మంచినీరు సరఫరా అవుతోంది.
క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం..
గతంలో మార్చి తర్వాత కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. అయితే కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ఎంజీకేఎల్‌ఐతో పాటు ఏపీలోని పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవా, మాల్యాల తదితర ప్రాజెక్టుల ద్వారా రోజువారీ నీటి ఎత్తిపోతలు సాగుతుండటం.. సాగర్‌కు నీటివిడుదల, శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి వంటి కారణాలతో కృష్ణా బ్యాక్‌వాటర్ లెవెల్స్ త్వరగా తగ్గిపోతున్నాయి. జనవరి ప్రారంభం నుంచే నీటిమట్టం పడిపోతోంది. గత డిసెంబర్‌లో 870 అడుగుల ఎత్తులో ఉన్న బ్యాక్‌వాటర్ లెవెల్.. ఇప్పుడు 850 అడుగుల మేరకు చేరింది. ఇదే విధంగా నీటిమట్టం తగ్గితే ఏప్రిల్ నెలాఖరు నాటికి 800 అడుగులకు నీటిమట్టం పడిపోతుంది. మిషన్ భగీఽరథ ద్వారా తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకునేందుకు 800 అడుగుల వరకే అనుమతులు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా సరిపడా నీటిని నిల్వ చేసుకోకుంటే.. మే, జూన్, జూలై నెలల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
కృష్ణా బ్యాక్‌వాటర్ లెవెల్స్ తగ్గుదల గురించి మిషన్ భగీరథ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలను తెలియజేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కృష్ణా రీవర్‌బోర్డు మేనేజ్‌మెంట్ (కేఆర్‌ఎంబీ) దృష్టికి తీసుకువెళ్లింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటివరకు వినియోగించిన నీటి వనరులు, శ్రీశైలం డ్యాంలో నీటినిల్వ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలపై కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఏపీలో విరివిగా సాగుతున్న నీటి ఎత్తిపోతలను కేఆర్‌ఎంబీ కట్టడి చేస్తేనే వేసవిలో నీటిఎద్దడిని నివారించవచ్చు.
రోజువారీగా పర్యవేక్షిస్తున్నాం..
కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. నీటి నిల్వకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను నిల్వ ఉంచే అవకాశం ఉంది. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ
●
కేఆర్‌ఎంబీ నిర్ణయం మేరకు..
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
కృష్ణానదిలో భారీగా
తగ్గుతున్న నీటిమట్టం
నెలరోజుల్లోనే 15 అడుగుల మేరకు తగ్గిన వైనం
800 అడుగుల వరకు మాత్రమే ‘మిషన్ భగీరథ’కు ఎత్తిపోసే వెసులుబాటు
ఏప్రిల్ నుంచి జూలై వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు
‘పాలమూరు’తోనే శాశ్వత పరిష్కారం..
మిషన్ భగీరథ పథకానికి నీటిని అందించే ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటినిల్వ సామర్థ్యం కేవలం 0.36 టీఎంసీ మాత్రమే. మిషన్ భగీరథ ద్వారా రోజూ 0.02 టీఎంసీని తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్‌లో అధికంగా నీటినిల్వ చేసుకునే అవకాశం లేదు. గత ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పరిధిలోకి మిషన్ భగీరథను చేర్చింది. తాగునీటి అవసరాలకు 6 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకునేలా ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా 2023 డిసెంబర్‌లో నార్లాపూర్ రిజర్వాయర్‌లోని 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2024లోనూ మరో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎత్తిపోతలు జరగలేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం వినియోగంలోకి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment