పలుగురాళ్ల గుట్టపై కవాతు నిర్వహిస్తాం
కొత్తకోట: గత ప్రభుత్వంలో మైనింగ్ పనులను దక్కించుకొని ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న ఆంధ్ర కాంట్రాక్టర్లను తరిమికొడదామని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామ శివారులోని పలుగురాళ్ల గుట్టను సందర్శించారు. గుట్టపై తవ్వుతున్న యంత్రాలు, పనులు చేస్తున్న సిబ్బందిని అనుమతులపై ఆరా తీశారు. మైనింగ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా.. వారు సైతం సమాధానం దాటవేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలుగురాళ్ల గుట్ట పశువుల మేతకు ఆధారంగా ఉంటుందని, పనులు ప్రారంభమైనప్పుడే ప్రజలు నిరసన వ్యక్తం చేశారన్నారు. బ్లాస్టింగ్ చేయడంతో ఇళ్లు దెబ్బతినడమే కాకుండా సమీప పొలాల్లో రాళ్లు, మట్టి పడి పంటలు నాశనమవుతున్నాయని, రైతులు సైతం బిక్కుబిక్కుమంటూ పొలాలకు వెళ్తుతున్నారని వివరించారు. గత పాలకులు చేసిన తప్పిదాలను ప్రజా ప్రభుత్వం కొనసాగించడం సహించరానిదన్నారు. వనపర్తి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని కాంట్రాక్టు రద్దు చేయించి ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్‌సురభి, మైనింగ్ జిల్లా అధికారి గోవిందరాజు ను కలిసి తాటిపాములలో క్రషర్ యాజమాన్యం చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని, అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వనం తిరుపతయ్య యాదవ్, వజగౌని వెంకటన్న గౌడ్, బత్తుల జితేందర్ గౌడ్, అంజన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment