‘పోలింగ్ కేంద్రం స్థాయిలో గణతంత్ర వేడుకలు’
వనపర్తి టౌన్: దశాబ్ద కాలానికి పైగా ప్రధాని మోదీ అందిస్తున్న సంక్షేమ పాలనే రాజ్యాంగానికి ప్రతీక అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ అన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం స్థాయిలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. సంవిధాన్ అభియాన్ కార్యశాలలో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానిపై పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ విష ప్రచారాన్ని సృష్టించిందని.. దీనిని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు చేరువ చేసేందుకే పార్టీ అధినాయకత్వం సంవిధాన్ అభియాన్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు. బీజేపీ పాలన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతుండటంతోనే సామాన్య ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ నెల 21 వరకు సంవిధాన్ కార్యశాలలు, 22, 23 తేదీల్లో దళిత, గిరిజన బస్తీల్లో నిద్ర, 24, 25 తేదీల్లో కళాశాలలు, వసతిగృహాల్లో సంవిధాన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, చిత్తారి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్, నాయకులు, సుమిత్రమ్మ, పెద్దిరాజు, శివారెడ్డి, రాజశేఖర్‌గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment