నేడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాక
అమరచింత/ఆత్మకూర్: అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. మధ్యాహ్నం 3.45 గంటలకు అమరచింతలోని డీఎంఆర్‌ఎం ఆస్పత్రిని సందర్శిస్తారన్నారు. 4.30 గంటలకు ఆత్మకూర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తారని వెల్లడించారు.
‘ఎన్నికల హామీలు
అమలు చేయాలి’
వనపర్తి రూరల్: కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశాలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ విభాగం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాకేంద్రంలోని జమ్మిచెట్టు, నల్లచెరువు, కొత్త బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ.. ఆశాలకు నెలకు రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారికి ఏఎన్‌ఎంగా పదోన్నతులు కల్పించాలని, రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, మృతిచెందిన కార్యకర్తకు దహన ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని, వేతనంతో కూడిన 20 రోజుల సీఎల్స్, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, నాయకులు పుట్టా ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, రమేశ్, రాములు, బుచ్చమ్మ, సునీత, భాగ్య, దేవమ్మ, అనసూయ, సత్యమ్మ, శ్యామల, అరుణ, మంజుల, చిట్టెమ్మ, రమాదేవి, అనిత, సుజాత పాల్గొన్నారు.
విద్యార్థులు ఆంగ్లంపై
పట్టు సాధించాలి
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థులు ఆంగ్లంపై మంచి పట్టు సాధించాలని జిల్లా ప్రభుత్వ ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా ఆంగ్లభాష ఉపాధ్యాయుల సంఘం, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు ఆంగ్లంలో ‘అధునాతన విద్యావిధానంలో విద్యార్థులు ఆంగ్లభాషలో ఎలా పట్టు సాధించాలి’ అనే విషయంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మొత్తం 31 పాఠశాలలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. వ్యాసరచన పోటీలో బిపిన్‌చంద్ర, నజీర, శ్రీచందన రెండో విభాగంలో ధ్యాన్ అధ్వైత్, శ్రీవల్లి, సిద్ధిక్, ఆయేష.. వక్తృత్వ పోటీలో సౌమ్య, మహేశ్వరి, సానియా విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఏసీజీఈ కె.గణేష్‌కుమార్, జీహెచ్‌ఎం ఉమాదేవి, ఇంగ్లీష్‌భాష టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌గౌడ్, ప్రధానకార్యదర్శి సీజీ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
బాదేపల్లి మార్కెట్‌కు పోటెత్తిన వేరుశనగ
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వేరుశనగ పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 4,990 క్వింటాళ్ల యార్డుకు విక్రయానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.6,586, కనిష్టంగా రూ.3,631 ధరలు లభించాయి. కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,310, రాగులు రూ.2451, పెబ్బర్లు రూ.5069, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,631, కనిష్టంగా రూ.2,056, హంస రూ.1,526 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.7,223, కనిష్టంగా రూ.7,009గా, ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,509గా ఒకే ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment