రోడ్డు ప్రమాదాల నియంత్రణ.. సమష్టి బాధ్యత
వనపర్తి: ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బందికి రహదారి నిబంధనలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ట్రాఫిక్ నియమాలు కేవలం వాహనదారులకే పరిమితమన్నది అపోహ మాత్రమేనని.. ఇది వ్యక్తిగత భద్రతకే కాకుండా కుటుంబ రక్షణకు ముఖ్యమైందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్టు ధరించాలని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని సూచించారు. భారత్‌లో ప్రతి ఏటా సుమారు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లను సురక్షితంగా మార్చడానికి ప్రతి కుటుంబం కలిసి పనిచేయాలని.. ముందుచూపు, జాగ్రత్తలు, క్రమశిక్షణతో రోడ్డు భద్రతను మెరుగుపర్చవచ్చన్నారు. కార్యక్రమంలో సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకొని సమాజంలో ఉన్నత పౌరులుగా తయారు కావాలి కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య బ్యాంకుల్లో జరిగే కార్యకలాపాలు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.ఆంజనేయులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామని, ప్రతి విద్యార్థి వర్క్‌షాప్ ద్వారా ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియజేశారు. డీపీఎంఎస్ బాషానాయక్, అరుణ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉన్నత చదువులకు బ్యాంకుల్లో రుణాలు ఇస్తామని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఎల్‌డీఎం సాయి మాట్లాడుతూ.. నామిని గురించి తెలుసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వనపర్తి యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్‌రెడ్డి ఏటీఎం వినియోగం, ఉద్గం పోర్టల్, పొదుపు ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment