బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని పెంచికలపేటలో ఇటీవల ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారాన్ని దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను ఆత్మకూరు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ముదరని రతన్, అతడి భార్య రత్నకుమారి గ్రామాల్లో తిరుగుతూ చిక్కు వెంట్రుకలు సేకరించి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలో పెంచికలపేటకు వచ్చిన రత్నకుమారి వృద్ధురాలు పెరుమాండ్ల రాజ్యలక్ష్మి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని ఆమెతో మాట్లాడింది. ఆరోగ్యం బాగు చేసే అతడిని భద్రాచలం నుంచి పంపిస్తానని చెప్పి భర్త రతన్‌ను పెంచికలపేటకు పంపించింది. అతడు రాజ్యలక్ష్మికి మాయమాటలు చెప్పి బంగారం అపహరించుకుపోయాడు. ఈక్రమంలో శుక్రవారం ఆత్మకూరు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. బంగారం దొంగలు రతన్, రత్నకుమారిని పట్టుకుని వారి నుంచి నుంచి 2 తులాల పుస్తెల తాడు, అర తులం చెవి కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ పరమేశ్, సిబ్బంది నర్సింగరావు, ఎ.రమేశ్, బి.రమేశ్‌ను అభినందించి వారికి రివార్డు అందజేశారు. ఏసీపీ కిషోర్‌కుమార్ వెంట సీఐ సంతోశ్ ఉన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
శాయంపేట: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల భూములను సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీంతో ప్రభుత్వం ప్రతిపక్షం కుట్ర చేయించినట్లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 2023 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని.. దీని ప్రకారమే భూ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను విమర్శించకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలని సీఎంను కోరారు. గత సర్పంచ్‌లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గురుకులం ఆకస్మిక తనిఖీ
న్యూశాయంపేట: హనుమకొండ నగరంలోని కేయూ క్రాస్ రోడ్డులో ఉన్న వరంగల్ (జీ–1) బాలికల గురుకులాన్ని వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని కిచెన్‌లో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను ప్రిన్సిపాల్ కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, డీటీఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు సంకల్పసిద్ధులు
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
● అట్టహాసంగా దివ్యాంగుల క్రీడా పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: దివ్యాంగులు సంకల్పసిద్ధులు, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అనుకున్న రంగాల్లో రాణిస్తారని, ఆదిశగా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దివ్యాంగుల సంక్షేమం కోసం చర్చిస్తామని, అందుకోసం సంబంధిత అధికారులు డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే దివ్యాంగుల కోసం అనేక చేయూత కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ శ్రీమన్నారాయణ, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment