ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు సహకరించాలి
వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో 2024–25 ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ చార్జీలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్‌ను సమర్థవంతంగా నిర్వహించుటకు మిలర్లకు పలు సలహాలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యం ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించిన తర్వాత కోత విధించకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ విషయంలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాకు కేంద్ర బృందం రాక
కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్‌కు చెందిన 8మంది డి కేటగిరి స్థాయి అధికారుల బృందం జిల్లాలో ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల అధ్యయన నిమిత్తం సోమవారం జిల్లాకు వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో వారు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళ శిశు సంక్షేమం, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు బృందం సభ్యులకు వివరించారు. ఈ బృందం సభ్యులు డిసెంబర్ 3వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో పర్యటించనున్నారు. నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లోని లక్నేపల్లి, మాగ్దూంపూర్ గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో పర్యటించి ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక, ఆర్థిక అంశాలపై అధ్యయనం చేస్తారు. అధ్యయనం కోసం ఆయా గ్రామాల్లోనే బస చేయనున్నారు. ఈ బృందానికి నోడల్ అధికారిగా డీఆర్డీఓ కౌసల్యాదేవి వ్యవహరిస్తారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, మిషన్ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా శిక్షణ కేంద్రం ప్రాంతీయ మేనేజర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment