బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్
మహబూబాబాద్: లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మరో ఉద్యమానికి మానుకోట నాంది అవుతుందని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10శాతానికి పెంచామని, తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినట్లు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అని చెబుతూ కార్యకర్తల నుంచి అవును అనే సమాధానం రాబడుతూ.. ఉత్సాహం నింపారు. గిరిజనులు ఏకం కావాలని, ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్‌ఎస్ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నేతలు ఏం మాట్లాడారంటే..
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గిరిజనుల భూములు లాక్కుంటే సీఎంను ఉరికించి కొడతారని అన్నారు. మహారాష్ట్ర ఫలితాలతోనైనా ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని హితవు పలికారు.
● మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ గిరిజనులు, దళితులకు రక్షణ కవచంగా ఉంటే.. రేవంత్‌రెడ్డి వారి భూములను లాక్కుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
● మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతపాలన చేస్తున్నదని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతోనే కాంగ్రెస్ ఖేల్ ఖతమైందన్నారు.
● ఎమ్మెల్సీ రవీందర్‌రావు మాట్లాడుతూ.. సీఎం గిరిజనుల భూములు లాక్కొని అల్లుడికి ధారాదత్తం చేస్తామంటే ఎవరూ ఊరుకోరని, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు.
● మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
● మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జగదీశ్వర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బానోత్ హరిప్రియ, గండ్ర వెంకటరమణారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, నరేందర్ పాల్గొన్నారు.
మానుకోట మహాధర్నాకు
కదలివచ్చిన గిరిజనులు
ఉత్సాహం నింపిన కేటీఆర్ ప్రసంగం
Comments
Please login to add a commentAdd a comment