కనీస పెన్షన్ అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: పెన్షనర్లకు కనీస పెన్షన్ చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెన్షనర్ల సమస్యలపై సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గం నగరంలోని ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు పెన్షన్ విభాగాధిపతికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి యాదగిరి, రెండు జిల్లాల ప్రధాన కార్యదర్శులు సముద్రాల లక్ష్మీనారాయణ, నారాయణగిరి వీరన్న, ఈపీఎస్ పెన్షనర్ల కన్వీనర్ వుప్పు సమ్మయ్య, నాయకులు ఎస్‌ఎస్ చారి, కుమారస్వామి, జగన్నాథం, శాయన్న, కళ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
నిట్‌లో జీయాన్
ప్రోగ్రామ్స్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని సెమినార్ హాల్ కాంప్లెక్స్‌లో సోమవారం ఐదు రోజుల రెండు జియాన్ (గ్లోబల్ ఇన్‌షియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్‌వర్క్స్) ప్రోగ్రామ్‌లను అట్టహాసంగా ప్రారంభించారు. ‘ఫిజిక్స్ బేస్డ్ అండ్ డాటా డ్రైవెన్ మోడలింగ్ ఇన్ ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టెనెబుల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, అడిటివ్ కోటింగ్ సబ్‌ట్రాక్టివ్ అండ్ హైబ్రిడ్’ పేరిట ఏర్పాటు చేసిన ఐదురోజుల జియాన్ ప్రోగ్రామ్‌ను క్వీన్ మేరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చిన్నపాట్ పన్‌వీసావస్, స్వీడెన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ప్రొఫెసర్ శ్రీకాంత్‌జోషి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు వేణుగోపాల్, మంజయ్య, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
వ్యాసరచన పోటీలు
విద్యారణ్యపురి: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు డీఈ ఓ వాసంతి జిల్లా క్వాలిటి కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘పునరుత్పాదక ఇంధన వనరులు’ అంశంపై వ్యాస రచన పోటీలుంటాయని తెలిపారు. జిల్లాలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈనెల 26న పాఠశాల స్థాయిలో, 27న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు సంబంధించి సందేహాలుంటే జిల్లా ప్రోగ్రాం ఆర్గనైజర్ మధుసూదన్‌రెడ్డి 98498 34110 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
బాలల వైజ్ఞానిక ప్రదర్శనల
సన్నాహక సమావేశం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్‌ఫెయిర్ నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని సోమవారం ప్రశాంత్‌నగర్‌లోని తేజస్వీ ఉన్నత పాఠశాలలో డీఈఓ వాసంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న బాలల వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల కన్వీనర్లు, కో–కన్వీనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పలు సూచనలిచ్చారు. ఎగ్జిబిట్లు ప్రదర్శించేందుకు, తిలకించేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్‌స్వామి, హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, తేజస్విని హైస్కూల్ హెచ్‌ఎం చంద్రశేఖర్, వివిధ కమిటీల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment