సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి
భీమవరం (ప్రకాశం చౌక్): సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఖజానా శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును ఆమె ప్రారంభించారు. రంగవల్లులు, బొమ్మల కొలువులను పరిశీలించి జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్‌ను అభినందించారు. బుద్ధిని వృద్ధి చేసుకోవడం సంక్రాంతి పండుగలో ఆంతర్యం అని కలెక్టర్ అన్నారు. మూడు రోజులపాటు ట్రెజరీ కార్యాలయంలో పండుగ సంబరాలు నిర్వహించనున్నారు. వంటలు, ముగ్గులు, క్రీడా పోటీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
భీమవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానం నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలలో గురువారం విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం డివిజన్ స్థాయిలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎస్‌ఏ–1 పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని అనుసరించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రత్యేక తరగతులను సమర్థంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కృషిచేయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటరు పి.శ్యామ్ సుందర్, కమ్యూనిటీ మోబిలైజేషన్ అధికారి వై.చంద్రశేఖర్, డివైఈఓ పి.నాగరాజు పాల్గొన్నారు.
చార్జీలు పెంచితే సహించం
భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి పేరు చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలు పెంచి వసూలు చేస్తే సహించమని జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో వాహనాల తనిఖీకి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతంలో ఓ బృందం, భీమవరం, పాలకొల్లు ప్రాంతంలో మరో బృందం తనిఖీలు చేస్తుందన్నారు. అధిక చార్జీలు వసూలు చేసినట్టు నిర్ధారిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమస్తే వాహనాలను సీజ్ చస్తామన్నారు.
గణతంత్ర వేడుకలకు ఎంపిక
పెంటపాడు: కేంద్ర ప్రభుత్వం వీర్‌గాథ 4.0 కార్యక్రమంలో భాగంగా అలంపురం గ్రామంలోని సరస్వతి విద్యాలయ విద్యార్థి జవ్వాది రాహిణి ఎంపికై ంది. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓలు టీవీఆర్‌కే, ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ రాహిణి రూ.10 వేల నగదు బహుమతితో పాటు ఈనెల 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటుందని చెప్పారు. పాఠశాల చైర్మన్ కొలనువాడ హనుమసత్యనారాయణరాజు (వెంకట్), డీఈఓ నారాయణ, సహాయ కో–ఆర్డినేటర్ శ్యాంసుందర్, ఎంఈఓలు ఆమెను అభినందించారు.
జాతీయ సైన్స్‌ఫేర్‌కు ఏనుగువానిలంక టీచర్
యలమంచిలి: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌లో ఏనుగువానిలంక ఉపాధ్యాయుడు ముద్దల శ్రీరామాంజనేయరావు ప్రదర్శించిన కొబ్బరి వ్యర్థాలతో విద్యుత్ తయారీ పరికరం జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. త్వరలో పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు శ్రీరామాంజనేయరావు అర్హత సాధించారని ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎస్‌వీ అవధాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment