మున్సిపాల్టీలో కీచక అధికారి !
సాక్షి, భీమవరం: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై ఓ అధికారి లైగింక వేధింపులు చర్చనీయాశంగా మారాయి. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ మహిళా ఉద్యోగుల పేరిట మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు అందా యి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుగుతుండగా వివరాలిలా ఉన్నాయి.
పెద్దరికం నటిస్తూ దురాలోచనలు
మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై ఈ ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. గతంలో పలువురు అధికారుల వద్ద పనిచేశామని, ఎప్పుడూ లేని ఇబ్బందిని ఎన్నికల తర్వాత బదిలీపై వచ్చిన ఓ అధికారి నుంచి ఎదుర్కొంటున్నామని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని పైకి పెద్దరికం నటిస్తూ దురాలోచనలు చేస్తున్నారని, తమను పేర్లతో కాకుండా బుజ్జి, చిన్నారి, బంగారం, పాప అంటూ పదేపదే పిలుస్తూ తాకుతుంటారని, సంతకాల కోసం ఒంటరిగా ఆయన చాంబర్ కు వెళ్లినప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తిస్తుంటారని, ఇంటికి వెళ్లాకా కూడా ఫోన్లు చేసి విసిగిస్తుంటారని ఆరోపించారు. శానిటేషన్ ఫీల్డ్ విజిట్ పేరుతో మహిళా సెక్రటరీలను వారి స్కూటీపై ఎక్కించుకుని తీసుకువెళ్లమంటారని, తన చాంబర్‌కు వచ్చి పనిచేయాలని ఒత్తిడి చేస్తుంటారని, ఆయన వేధింపులు భరించలేక ఓ ఉద్యోగిని సెలవు పెట్టి వెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. సమస్యను కొందరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా గతంలో ఆయన పనిచేసిన పలుచోట్ల ఇదే తరహాలో మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేసినట్టుగా చెప్పారని పేర్కొన్నారు. గతంలో ఆయన భీమవరంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన సమయంలో మావుళ్లమ్మ గుడి వీధికి చెందిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారని, తాడేపల్లిగూడెంలో ఒక మహిళా వర్కర్‌ను వేధించడంతో ఆమె అందరి ముందు చెప్పుతో కొట్టినట్టుగా తమకు తెలిసిందని మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో తెలిపారు.
కొనసాగుతున్న విచారణ
ఉద్యోగినుల ఫిర్యాదుపై మహిళా కమిషన్‌తో పాటు ఉన్నత వర్గాల నుంచి మున్సిపల్ కమిషనర్ పి.రామచంద్రారెడ్డికి ఆదేశాలందాయి. ఈ మేరకు ఐదుగురు మున్సిపల్ కార్యాలయ మహిళా ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.విశ్వచైతన్య అధ్యక్షురాలి గా ఏర్పాటుచేసిన కమిటీలో ఏఏఓ ఎ.బాలసుబ్రహ్మణ్యేశ్వరి, డబ్ల్యూపీఎస్ పి.కీర్తి, జూనియర్ అసిస్టెంట్ కె.శిరీష, అటెండర్ పీవీ కనకదుర్గ సభ్యులుగా ఉన్నారు. మున్సిపల్, సచివాలయ, శానిటరీ విభాగాల్లో 240 మంది వరకు మహిళా ఉద్యోగులు పనిచేస్తుండగా మూడు రోజులుగా 140 మందిని విచారించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులను వేర్వేరుగా పిలిచి మాట్లాడుతుండటంతో సమయం పడుతోందని, సంక్రాంతి తర్వాత మిగిలిన వారితో మాట్లాడతామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని కూడా వివరణ ఇవ్వాలని కోరామన్నారు. ఇదిలా ఉండగా సదరు అధికారి మరో నాలుగు నెలల్లో రిటైర్ కానున్నట్టు తెలిసింది.
విచారణ అనంతరం నివేదిక
ఓ అధికారి లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీతో విచారణ జరిపిస్తున్నాం. కమిటీ ఇచ్చిన నివేదిక, సదరు అధికారి వివరణను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
–పి.రామచంద్రారెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భీమవరం
భీమవరంలో మహిళా ఉద్యోగుల పేరిట మంత్రికి ఫిర్యాదు
లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు
విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్, ఉన్నతాధికారులు
మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీతో విచారణ
నాలుగు నెలల్లో రిటైర్ కానున్న సదరు అధికారి
Comments
Please login to add a commentAdd a comment