మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో నరబలి తప్పదని మరోసారి రుజువైందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు భక్తులు అసువులు బాసిన ఘటన బాధాకరమని అన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకునేందుకు వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగిందంటే భద్రతా లోపం ఏమేరకు ఉందో అర్థమవుతోందని చెప్పారు. గతంలో రాజమండ్రి పుష్కరాల్లో సైతం చంద్రబాబు తన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది భక్తులను బలి తీసుకున్న వ్యవహారాన్ని ఈ సందర్భంగా కారుమూరి గుర్తుచేశారు. ఇటీవల రాజమండ్రిలో ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన ఇద్దరు యువకులు సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం దారుణమని అన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వివాదం చేయాలని కూటమి నేతలు ప్రయత్నించారని, ఇటువంటి దుష్ప్రచారాల కారణంగానే అమాయక భక్తులు అసువులు బాస్తున్నారని ఆయన విమర్శించారు. టీటీడీ ఒక ప్లానింగ్, పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం కారణంగానే తొక్కి సలాట వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా యని స్పష్టం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కారుమూరి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment