పశువధను ఆపలేవా ఆరిమిల్లీ?
తణుకు అర్బన్: లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో తణుకు మండలం తేతలిలో పోలీసులను కాపలాగా పెట్టి స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పశువధ శాలను యథేచ్ఛగా నడిపిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పశు వధశాలకు కారుమూరి హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ డైవర్షన్ చేస్తున్నావే కానీ పశు వధశాలను మూయిస్తావా మూయించలేవా అనే విషయం ప్రజలకు నేరుగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పశు వధశాల అక్రమంగా నడుస్తోందని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నావంటే నీకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన డబ్బే ముఖ్యమా అని నిలదీశారు. డబ్బే ముఖ్యమైతే తణుకువాసుల వద్ద చందాలు వసూలు చేసి నీకిస్తామని, పశు వధశాలను మూయించాలని విజ్ఞప్తి చేశారు. పశు వధకు వ్యతిరేకమంటావు.. పోరాడే వారిపై బైండోవర్ కేసులు, లాయర్ నోటీసులు ఇప్పిస్తావు.. పోలీస్ యాక్టులు పెట్టి నిరసన దీక్షను పోలీసులతో తొలగింపచేశావు.. అంటూ మండి పడ్డారు. తనపై బురద చల్లడం మాని పశువధపై ఎమ్మెల్యే ధోరణి మార్చుకోవాలని సూచించారు. మహిళలు, కార్మికులు రోదిస్తున్నా ఎమ్మెల్యేకి పట్ట డం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గోసేవా సమితి సభ్యులు పోరాటం చేస్తే ఫ్యాక్టరీకి తాళం వేయించానని కారుమూరి గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామస్ అయ్యావు
పశువధను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేగా, మద్యం సిండికేటులో పావలా వాటా ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా నువ్వు ఫ్యామస్ అయ్యావంటూ ఎమ్మెల్యే రాధాకృష్ణను మాజీ మంత్రి కా రుమూరి ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చెత్త తదితర అంశాలపై టిక్‌టాక్‌లు, రీల్స్ చేశారని, ఇప్పుడు రోడ్లపై ఉన్న ఆ చెత్త పైనా, పశువధ పైనా రీల్స్ చేస్తే అందరూ చూసి తరిస్తారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ పుణ్య మా అని తణుకులో రోడ్లపై ఉండే ఆవులు సైతం కనిపించడం లేదని స్పష్టం చేశారు.
అవసరమైతే జగనే వస్తారు
తణుకు వాసులను పశువధ నుంచి విముక్తి చేసేందుకు ఎంతవరకు అయినా వెళ్తానని, త్వరలో ఎమ్మె ల్సీ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కో– ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి సత్యనారాయణ తణుకు వస్తారని, ఇంకా అవసరమైతే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వచ్చి బాధితులకు అండగా నిలుస్తున్నారని కారుమూరి అన్నారు. పశువధ ప్రాంత జట్టు కూలీలు మాట్లాడుతూ రెండు నెలలుగా కర్మాగారంలోకి పశువులు వెళ్తుండటం చూస్తున్నామని, దుర్వాసనతో భోజనాలు చేయలేకపోతున్నామని వాపోయారు. వైఎస్సార్‌సీపీ నేత చినిమిల్లి వెంకటరాయుడు, సీనియర్ న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, వైఎస్సార్‌సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, వి.సీతారాం, చింతన్న తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment