పొరుగుదేశం పాకిస్తాన్‌లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్‌లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్‌లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.
తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్‌కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.
ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment