పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.
పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్‌బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్‌మెంట్ (ఎస్‌బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.
గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.
తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment