మట్టి తరలిస్తున్న వారిపై కేసు | - | Sakshi
Sakshi News home page

మట్టి తరలిస్తున్న వారిపై కేసు

Published Thu, May 16 2024 11:10 AM | Last Updated on Thu, May 16 2024 11:10 AM

మట్టి తరలిస్తున్న వారిపై కేసు

మట్టి తరలిస్తున్న వారిపై కేసు

వేములపల్లి: చెరువు శిఖాన్ని ఆక్రమించి మట్టి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. వేములపల్లి మండలంలోని బుగ్గబావిగూడేనికి చెందిన కేతనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పుట్ట మహేష్‌ బుధవారం ఒక జేసీబీ, ఏడు ట్రాక్టర్లతో గ్రామ శివారులోని నియామల్కం (పెద్ద చెరువు)లోకి ప్రవేశించి చెరువు శిఖం హద్దులను తొలగించి మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఇరిగేషన్‌ ఏఈఈ ఎస్‌. సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని జేసీబీ, ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌రెడ్డి, మహేష్‌తో పాటు జేసీబీ, ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

బీబీనగర్‌: మండల కేంద్రంలోని ఓ వెంచర్‌లో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన బిట్కూరి మనోహర్‌(25) అదే గ్రామానికి చెందిన భూమికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో మార్చి నెలలో పురుగుల మందు తాగి భూమిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో మనోహర్‌ జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మానసికంగా కుంగిపోయిన మనోహర్‌ బుధవారం తెల్లవారుజామున బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుండెపోటుతో

ఆస్పత్రి వాచ్‌మెన్‌ మృతి

కుటుంబ సభ్యుల ఆందోళన

సూర్యాపేట: ఆస్పత్రిలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురానికి చెందిన నకిరేకంటి పుల్లయ్య(63) స్థానికంగా కొత్త బస్టాండ్‌ వద్ద గల ఆర్వీ ఆస్పత్రిలో నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి విధులకు హాజరైన ఆయన బుధవారం ఉదయం ఆస్పత్రి ఆవరణలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఆస్పత్రి సిబ్బంది గమనించి పుల్లయ్య కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. కాగా పుల్లయ్య మృతిపై అనుమానం ఉందని ఆస్పత్రి ఎదుట అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడి కుమారుడు శేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement