మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు
నల్లగొండ: దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేళ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగు రేఖలు సృష్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలిగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
3నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ ఉచిత తరగతులు
భువనగిరి : శక్తి మిషన్, జై భీమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 3నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ ఉచిత తరగతులు నిర్వహించనున్నట్లు శక్తి మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్తాల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భువనగిరిలోని శ్రీ గాయత్రి బాలికల జూనియర్ కళాశాలలో సాయంత్రం 6.30నుంచి రాత్రి 7.30వరకు తరగతులు ఉంటాయని, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ హాజరుకావచ్చన్నారు. సెల్ నంబర్ 93919 54727ను సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
స్వర్ణ తాపడానికి విరాళం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురానికి బంగారు తాపడం కోసం సిరిసిల్లకు చెందిన నెల్లుట్ల కనకయ్య–వరలక్ష్మీ దంపతులు రూ.1,51,111 విరాళం అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం దేస్థానం ఈఓ భాస్కర్‌రావుకు ఇచ్చారు. అంతకుముందు కనకయ్య దంపతులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఫీజు దీక్ష
భువనగిరి : స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు స్వస్తి పలుకుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే బకాయిలు విడుదల చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షుడు సింగనబోయిన మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అన్నంపట్ల కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు,నాయకులు ఈర్ల ముత్యాలు, ఎండీ సలీం పాల్గొన్నారు. వీరికి కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పరుశురాం, యాకుబ్ సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment