పటాకుల రేట్లు పేలుతున్నాయ్..
భువనగిరిటౌన్ : పటాకుల ధరలు పేలిపోతున్నాయి. ఈసారి ఏకంగా 30శాతం నుంచి 40శాతం మేర ధరలు పెంచేశారు. పండుగలకు పెళ్లిళ్ల సీజన్ తోడవడం, ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు పెంచి అమ్ముతున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. తప్పదు కాబట్టి కొద్దిమొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
వాతావరణంపైనే ఆశలు
వరుసగా రెండేళ్ల నుంచి దీపావళి సమయంలో వర్షాలు కురువడంతో వ్యాపారం కలిసిరాలేదని, ఈసారి వాతావరణం కలిసొస్తుందన్న ఆశతో క్రాకర్స్ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారు. ఆ నమ్మకంతోనే పెద్ద ఎత్తున టపాసుల సెంటర్లు ఏర్పాటు చేశారు. భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ మున్సిపాలిటీల్లో టపాసుల కేంద్రాలు వెలిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 శాశ్వత దుకాణాలు ఉన్నాయి. దీపావళికి దుకాణాల
ఏర్పాటుకు 70కి పైగా దరఖాస్తులు రాగా.. అందులో 50 మందికి అనుమతులు దక్కాయి. ఇందులో ఒక్క భువనగిరిలోనే 10 సెంటర్లు ఉన్నాయి.
జీఎస్టీ, ముడి సరుకుల ధరలు తగ్గినా..
టపాసుల అమ్మకాలపై జీఎస్టీ 23 నుంచి 18 శాతా నికి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు టపాసుల తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు కూడా కొంతమేర తగ్గాయి. దీంతో ఈ ఏడాది రేట్లు తగ్గుతాయని అంతా భావించారు. కానీ, 30నుంచి 40 శాతం ఎక్కువకు విక్రయిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
టపాసుల దుకాణాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి. మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీల్లో అయితే ముందస్తుగా పన్ను చెల్లించి అనుమతి పొందాలి. కానీ, వ్యాపారుల్లో కొంతమంది మాత్రమే లైసెన్స్ పొందగా, మరికొందరు లైసెన్స్ తీసుకోకుండా అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పి క్రాకర్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మున్సిపాలిటీలు, పంచాయతీల ఆదాయానికి గండిపడనుంది.
సిండికేట్‌గా దోపిడీ!
ఓ వైపు దీపావళి.. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో సరుకు తెప్పించిపెట్టారు. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లయిన మలక్‌పేట, బేగంబజార్, రాణిగంజ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి టపాసులు దిగుమతి చేసుకున్నారు. ప్రధానంగా దీపావళికి నాలుగైదు రోజులపాటు రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అనధికార లెక్కల ప్రకారం రోజూ రూ.70లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్మకాలు ఉంటాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బరాత్‌ల కోసం భారీగా టపాసులు కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారం జరిగే కొద్ది రోజుల్లో పెద్దమొత్తంలో సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వ్యాపారులు సిండ్‌కేట్‌గా ఏర్పడి ధరలు పెంచేశారు.
గత ఏడాది కంటే 30 నుంచి 40 శాతం అధికం
ఫ కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్య తరగతి ప్రజలు వెనకడుగు
ఫ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండానే దుకాణాలు ఏర్పాటు
ఫ మున్సిపాలిటీలు, పంచాయతీల ఆదాయానికి గండి
అనుమతి తప్పనిసరి
క్రాకర్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే అనుమతి పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. ఫైర్ సేఫ్టీ కోసం తమ వద్దకు వచ్చిన వ్యాపారులకు అనుమతులు ఇస్తున్నాం. ధరల విషయం మాకు సంబంధం లేదు. –మధుసూధన్‌రావు,
అగ్నిమాపక శాఖ అధికారి
భువనగిరి పట్టణంలోని మాసుకుంట వద్ద ఏర్పాటు చేసిన క్రాకర్స్ సెంటర్‌లో ఓ యువకుడు 13 రకాల టపాసులు కొనుగోలు చేశాడు. ఇందుకు గాను రూ.3,760 బిల్లు అయ్యింది. బిల్లు తగ్గించమని వ్యాపారిని కోరగా లేబర్, ట్రాన్స్‌పోర్టు, దుకాణాల అద్దె పెరిగిందని.. సాధ్యపడని చెప్పినట్లు సదరు యువకుడు వాపోయాడు. పండుగకు టపాసులు కాల్చడం ఆనవాయితీ కావడంతో.. బిల్లు మొత్తం చెల్లించినట్లు తెలిపాడు.
కొన్ని టపాసుల ధరలు ఇలా.. (రూ.ల్లో)
రకం (ప్యాకెట్) గత ఏడాది ప్రస్తుతం
కాకర పుల్లలు 46 75
కాకర పూలు 20 నుంచి 60 30 నుంచి 100
చిచ్చుబుడ్డి (చిన్నవి) 40 నుంచి 60 60 నుంచి 80
చిచ్చుబుడ్డి (పెద్దవి) 60 వరకు 100
పెన్సిల్స్ 35 50
1000 వాలా 220 300
500 థౌజెండ్ వాలా 800 1,200
Comments
Please login to add a commentAdd a comment