వాహనాలకు తుప్పు.. ఎవరిది తప్పు!
చౌటుప్పల్ రూరల్ : గంజాయి సరాఫరా చేస్తూ, నిబంధనలు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తూ.. ఇతర ఏ కారణాలతోనైనా పోలీసులకు పట్టుబడిన వాహనాలను యజమానులు ధ్రువీకరణ పత్రాలు చూపించి, జరిమానా చెల్లించి తీసుకెళ్లాలి. కానీ, అటువంటి ప్రయత్నం చేయకపోవడంతో వందలాది వాహనాలు పోలీస్ స్టేషన్‌లో తుప్పపట్టి పోతున్నాయి. ఎండకు ఎండి, వానకు తడుస్తూ పనికిరాకుండా పోతున్నాయి. పట్టుబడిన వాహనాలను ప్రతి ఆరు నెలలకు ఒకమారు వేలం వేయాల్సి ఉండగా పోలీసులు సైతం ఏనాడూ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
చౌటుప్పల్ పీఎస్‌లో పేరుకుపోయిన వాహనాలు
చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రమాదాలకు గురైన, కారణమైన వాహనాలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుంటారు. గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డవి కొన్ని, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు ఇంకొన్ని ఉన్నాయి. పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లతో పాటు సర్వీస్ రోడ్డు వెంట సుమారు 250 వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ కేసులు తేలకపోవడంతో ఏళ్ల తరబడి స్టేషన్లలోనే ఉంటున్నాయి.
మాయమవుతున్న వాహనాలు, విడి భాగాలు
పట్టుబడిన వాహనాల కోసం యజమానులు రాకపోవడంతో దశాబ్దకాలంగా స్టేషన్లలోనే ఉంటున్నాయి. వీటిలో కండీషన్ ఉన్న వాహనాలను పోలీసులు వాడుతున్నట్లు గతంలో విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కార్లు, ఆటోల విడిభాగాలు మాయమవుతున్నాయి. ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో, సర్వీస్ రోడ్డులో ఉన్న వాహనాలకు రక్షణ లేకపోవడంతో వాటి భాగాలు చోరీకి గురవుతున్నాయి.
సీజ్ చేసిన వాహనాలతో నిండిపోతున్న పోలీస్‌స్టేషన్లు
ఫ తీసుకెళ్లడానికి ముందుకురాని యజమానులు
ఫ వేలం వేయకుండా చోద్యం చూస్తున్న పోలీసు శాఖ
ఫ తుప్పు పడుతున్న వాహనాలు
ఫ కార్లు, ఆటోల విడి భాగాలు మాయం
ఉన్నతాధికారులకు లిస్టు పంపుతాం
వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉన్నతాధికారుల అనుమతితో రాచకొండ హెడ్‌క్వార్టర్స్ పరిధిలో వేలం వేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వేలం వేశారు. అయితే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల కేసులు తేలలేదు. లెక్కలు తీసి వేలం వేయడానికి అనుకూలంగా ఉన్న వాహనాల లిస్టును త్వరలో ఉన్నతాధికారులకు పంపుతాం. తదుపరి వేలం తేదీలను ప్రకటిస్తాం.
–మన్మథకుమార్, ఎస్‌హెచ్‌ఓ, చౌటుప్పల్
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాలతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన వాహనాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేయాలి. అలా చేసిన వాహనాలను ఆరు నెలలకు ఒకసారి బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. కానీ, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వాహనాలను వేలం వేయడానికి కనీస ప్రయత్నాలు చేయడం లేదు. వాహనాలను వేలం వస్తే ప్రభుత్వానికి కొంత మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment