దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

Published Thu, May 16 2024 11:10 AM

దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్‌

భువనగిరి క్రైం: గుడిలోని దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. మండలంలోని బస్వాపురం గ్రామంలో మర్రిచెట్టు కింద ఉన్న గుడిలోని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అదే గ్రామానికి చెందిన చిక్క రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

గోడ కూలి వ్యక్తి మృతి

నాగారం/తుంగతుర్తి: పాత ఇల్లు కూల్చుతుండగా గోడ కూలి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండలం పసునూర్‌లో బుధవారం జరిగింది. వివరాలేజజ తుంగతుర్తి మండలం సూర్యతండా ఆవాసం గుట్టకిందితండాకు చెందిన గుగులోతు వెంకన్న(28) నాగారం మండలం పసునూర్‌లోని నల్లగంటి సుగుణమ్మకు చెందిన పాత ఇల్లును కూల్చడానికి కూలీగా వచ్చాడు. పెంకుటిల్లు విప్పతున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడటంతో వెంకన్న తలకు తీవ్ర గాయమైంది. బాధితుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉంది.

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జైలుశిక్ష

భూదాన్‌పోచంపల్లి: లైంగిక వేధింపుల కేసులో పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన జె. శ్రీకాంత్‌కు బుధవారం చౌటుప్పల్‌ కోర్టు 6నెలల జైలుశిక్ష విధించింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌ 2016లో పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్‌ చేశారు. ఈ కేసు చౌటుప్పల్‌ కోర్టులో ట్రయల్‌ జరగగా ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి, కోర్టు కానిస్టేబుల్‌ సాయికుమార్‌, హోంగార్డు శివకుమార్‌ తగిన సాక్ష్యాలను అందజేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 6నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంలో

గేదెలు మృతి

చిలుకూరు: మండల పరిధిలోని ఆచార్యులగూడెం వాసి మునగాల సైదిరెడ్డికి చెందిన రెండు పాడి గేదెలు బుధవారం మేత మేసేందుకు గ్రామ పరిధిలోని పొలాల్లోకి వెళ్లాయి. అక్కడ కిందకు వేలాడుతున్న కరెంట్‌ తీగలు తగిలి రెండు గేదెలు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement