చెత్తపై ఏదీ చిత్తశుద్ధి!
రామన్నపేట : ప్రజారోగ్యంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి. ఇంటింటా వేర్వేరుగా సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేయాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదు. నిధుల లేమి, పారిశుద్ధ్య సిబ్బంది కొరత వల్ల లక్ష్యం చేరుకోవడం ఇబ్బందిగా మారింది. ఫలితంగా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
రూ.10.52కోట్ల వ్యయంతో నిర్మాణం
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయ వనరులు సమకూర్చాలన్న సంకల్పంతో సేకరించిన చెత్తను తరలించేందుకు జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా ఉపాధిహామీ నిధులు రూ.10.52 కోట్లతో షెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డుకు రూ.2.50 లక్షల చొప్పున ఖర్చు చేశారు. వీటితో పాటు చెత్త సేకరణకు ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ సమకూర్చారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేసేందుకు ఇంటింటికీ రెండు బుట్టలు పంపిణీ చేశారు.
చెత్తను వేరు చేయడం ఇలా..
E ట్రాక్టర్ ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులోని సెగ్రిగేషన్ షెడ్డు వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా ప్లాట్‌ఫారాలపై దింపాలి.
E కంపోస్టు ఎరువు తయారీకి ఉపయోగపడే తడి వ్యర్థాలను సూర్యరవ్మి తగిలేవిధంగా 3,4 రోజులు ఆరబెట్టాలి.
E ఆరబెట్టిన తడిచెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేయాలి. అలా తయారు చేసిన సేంద్రియ ఎరువును నర్సరీల్లో బ్యాగులు నింపడానికి, హరితహారం మొక్కలకు ఎరువుగా వాడాలి. మిగిలిన ఎరువును రైతులకు విక్రయించాలి.
E ఎరువు తయారీకి ఉపయోగపడని పొడిచెత్తలోని కాగితం, గాజు, ఇనుము, ప్లాస్టిక్, పాలిథిన్, లెదర్, బట్టలు వంటి వ్యర్థ్యాలను వేరుచేసి సెగ్రిగేషన్ షెడ్డులోని కంపార్ట్‌మెంట్లలో వేర్వేరుగా వేయాలి.
E వేరుచేసిన పొడిచెత్త వ్యర్థాలను వేరువేరు బ్యాగుల్లో కట్టలు కట్ట అధీకృత స్క్రాప్‌డీలర్లకు విక్రయించాలి.
రామన్నపేటలో నిరుపయోగంగా ఉన్న
సెగ్రిగేషన్ షెడ్
పంచాయతీ కార్మికులపై అదనపు భారం
సేకరించిన చెత్తను వేరు చేయడం, ఎరువు తయారు చేయడం, పొడిచెత్తను భద్రపరచి విక్రయించే బాధ్యతలను అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అప్పగించింది. కానీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించలేదు. నిధుల కొరత కారణంగా పంచాయతీలు సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు లేకపోయింది. దీంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుండడంతో సెగ్రిగేషన్ షెడ్లలో పనిచేయడానికి వీలుపడడం లేదు. ఇళ్లనుంచి సేకరించి డంపింగ్ యార్డులకు సేకరించిన చెత్త గుట్టలుగా పేరుకుపోతుండడం, ఎరువు తయారీ నిలిచిపోవడంతో విధిలేక తగలపెడుతున్నారు. ఉపాధిహామీ పథకంలో పనిదినాలు కల్పించి సెగ్రిగేషన్ షెడ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
అలంకారప్రాయంగా సెగ్రిగేషన్ షెడ్లు
గ్రామ పంచాయతీల్లో తయారుకాని సేంద్రియ ఎరువు
సేకరించిన చెత్తను
తగలబెడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది
రూ.కోట్లల్లో ప్రజాధనం వృథా
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment