అవగాహనతోనే కుష్టు నివారణ
భువనగిరి : జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులు క్రమంగా తగ్గుతున్నారు. 2022లో 42 మంది ఉండగా 2024 ఆగస్టు నాటికి ఆ సంఖ్య 18కి తగ్గింది. 2027 నాటికి కుష్టురహిత జిల్లాగా మార్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
తగ్గుతున్న బాధితులు
జిల్లాలో ఎల్‌సీడీసీ (లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపేయిన్) ద్వారా గుర్తించిన కుష్టు బాధితులకు ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2022 నుంచి 2024 ఆగస్టు నాటికి జిల్లాలో 92 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 68 మందికి వ్యాధి నయం కాగా.. ప్రస్తుతం 24 మంది చికిత్స పొందుతున్నారు.
చేపడుతున్న చర్యలు ఇవీ..
● జాతీయ ఆరోగ్య మిషన్ సర్వేలో గుర్తించిన కుష్టు బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు.
● శాశ్వత అంగవైకల్యానికి గురికాకుండా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, కూకట్‌పల్లిలోని శివానంద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
● శస్త్ర చికిత్స అనంతరం వారికి పౌష్టికాహారంతో పాటు ఇతర అవసరాల కోసం రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
● ప్రభుత్వ పరంగా పింఛన్లతో పాటు ఎంసీఆర్, మందుల కిట్లు ఇస్తున్నారు.
సర్వేకు సన్నాహాలు
జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఇంటింటి సర్వే చేయడానికి 704 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక ఆశా కార్యకర్త, ఒక వలంటీర్ ఉంటారు. ఈ ఏడాది 2024 మార్చిలో ఇంటింటి సర్వే చేశారు. తాజాగా డిసెంబర్ 2నుంచి 15వ తేదీ వరకు 14 రోజుల పాటు సర్వే చేయనున్నారు. ఇందుకోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి గతంలో గుర్తించిన కుష్టువ్యాధి గ్రస్తుల ఆరోగ్యంపై వివరాలు సేకరించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 2 నుంచి సర్వే చేస్తాం
కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు డిసెంబర్ 2వ తేదీనుంచి సర్వే చేపట్టనున్నాం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు చేశాం. సర్వే కోసం 704 బృందాలు ఏర్పాటు చేశాం. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స, ఇతర సదుపాయాలు కల్పిస్తాం.
–సాయిశోభ, జిల్లా కుష్టు వ్యాధి
నివారణ అధికారి
ఫ తగ్గుముఖం పడుతున్న కేసులు
ఫ 2027 నాటికి కుష్టురహిత జిల్లాగా మార్చాలన్నది లక్ష్యం
ఫ సత్ఫలితమిస్తున్న
జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు
ఫ వ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్స, మందులు పంపిణీ, పింఛన్ అందజేత
ఫ సర్వేకు సన్నద్ధమవుతున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment