అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు
జేసీ అదితిసింగ్
కడప సెవెన్‌రోడ్స్ : దీపం పథకం–2 ద్వారా అర్హత ఉన్న ప్రతి వినియోగదారుని ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో దీపం పథకం–2 పై ఆమె మీడియాతో మాట్లాడారు. గత నెల 31వ తేదీ నుంచి దీపం పథకం–2 రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద సంవత్సరంలో అర్హత కలిగిన వినియోగదారునికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మూడు గ్యాస్ సిలిండర్లను అర్హత గల వినియోగదారులకు మూడు బ్లాకులుగా చేసి పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి జూలై మాసం వరకు ఒక బ్లాకుగా, ఆగస్టు మాసం నుంచి నవంబర్ మాసం వరకు మరో బ్లాక్ ఉందన్నారు. అలాగే డిసెంబర్ మాసం నుంచి 2025 మార్చి వరకు మూడో బ్లాక్ ఉందని చెప్పారు. అర్హత గల వినియోగదారులందరికీ ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించామని చెప్పారు. అర్హత కలిగి ఉండి కూడా ఫోన్ లేకపోయినా వారిని కూడా అర్హులుగానే ఉంటారన్నారు. ఈ పథకం కింద నియమ నిబంధనల మేరకు వినియోగదారుడు ఆధార్ నంబరు, బియ్యం కార్డు, యాక్టివ్ ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండాలన్నారు. అదర్ డిపార్టుమెంట్ డాటా బేస్‌తో కూడా మ్యాచ్ అయి ఉండాలన్నారు. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పటికీ గ్యాస్ సబ్సిడీ మొత్తం ఖాతాలలో జమ కాని పరిస్థితి ఉంటే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వారు వెంటనే దానిని పరిష్కరిస్తారన్నారు. కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ ఈకేవైసీ జరగకుండా ఉండటే గ్యాస్ డెలివరీ బాయ్ వినియోగదారుల నుంచి ఈకేవైసీ తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment