ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం ఇచ్చాం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం ఇచ్చాం

Published Fri, Nov 8 2024 12:48 AM | Last Updated on Fri, Nov 8 2024 12:48 AM

ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం ఇచ్చాం

ఎమ్మెల్యేకు ఎంతో గౌరవం ఇచ్చాం

ఆ గౌరవాన్ని ఆమె కాపాడుకోలేదు

ఐదు నెలలుగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు

అందుకే చట్ట ప్రకారం నడుచుకున్నాం

నేనే రాజు, నేనే మంత్రిలా ఎమ్మెల్యే ప్రవర్తన బాధాకరం

కడప మేయర్‌ కె.సురేష్‌బాబు ఆవేదన

కడప కార్పొరేషన్‌: దేశంలో ఎక్కడా ఏ ఎమ్మెల్యేకు ఇవ్వని విధంగా కడప ఎమ్మెల్యే మాధవికి తమ పాలకవర్గం ఎంతో గౌరవం ఇచ్చిందని, ఆ గౌరవాన్ని ఆమె కాపాడుకోలేకపోయారని కడప నగర మేయర్‌ కె.సురేష్‌బాబు అన్నారు. గురువారం కడప కార్పొరేషన్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024 జూలై 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమెను మేయర్‌తో సమానంగా కుర్చీ వేసి కూర్చొబెట్టామని, ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత నగరాభివృద్ధి కోసం కలిసి మెలిసి పాటుపడాలని భావించామన్నారు. అయితే ఎమ్మెల్యే వైఖరి అందుకు తగినట్లుగా లేదని, మొదటి సమావేశంలోనే మహిళా కార్పొరేటర్‌ను కించపరిచేలా మాట్లాడి తన అహంభావాన్ని చూపారన్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఆమె తమపై, తమ కార్పొరేటర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తన ఇంటిపై చెత్త వేయించిందని, 8వ డివిజన్‌ ఇన్‌చార్జి బాలకృష్ణారెడ్డి లే అవుట్‌లో కాలువ ఉందని పట్టుబట్టి ప్రహారీ కూల్చి వేయించారన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి 36వ డివిజన్‌ ఇన్‌చార్జి రఫీని అరెస్టు చేయించారని, ఇలాంటి వ్యక్తికి అంత గౌరవం ఇవ్వడం సరైంది కాదని భావించి చట్టప్రకారం నడుచుకున్నామన్నారు. ఎమ్మెల్యే నగరపాలక సంస్థలో సభ్యురాలు కాదని, ఎక్స్‌ అఫిషియో సభ్యురాలు మాత్రమేనని తెలిపారు. అందుకే మేయర్‌కు తప్ప మిగిలిన వారందరికీ జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం కిందనే సీట్లను వేయించామని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌ సమావేశంలో తాగునీరు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు వంటి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యే నేనే రాజు, నేనే మంత్రిగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. కర్నూలులో సాక్షాత్తు మంత్రి టీజీ భరత్‌ కూడా కార్పొరేటర్లతో పాటు కిందే కూర్చొన్న విషయాన్ని ఉదహరించారు. 400 మంది కార్యకర్తలను వెంటేసుకుని వచ్చి నియంతృత్వ ధోరణిలో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మాకు మనుషులు లేరా....మేమనుకుంటే ఎమ్మెల్యేను కార్పొరేషన్‌లోకి రాకుండా గేటు వద్దే ధర్నా చేసేవారంకదా.. అని తెలిపారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే

ఆ పార్టీ వాళ్ల కాళ్లు పట్టుకోలేదు

మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా.. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి, వరదరాజులురెడ్డి వంటి సీనియర్లు ఉన్నప్పుడు టీడీపీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్న కాలంలో కూడా ఒక్క ఓటుతో జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యానని, ఏ పార్టీలో ఉన్నా అవతలి పార్టీ వారికి గౌరవమిస్తూ మర్యాద పూర్వకంగా నడుచుకున్నానని మేయర్‌ కె.సురేష్‌బాబు తెలిపారు. తాను టీడీపీతో కుమ్మక్కయ్యానని ఆ పార్టీ నేత శ్రీనివాసులురెడ్డి ఆరోపించడం దారుణమన్నారు. తాను మొదటి నుంచి ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నానని.. సర్పంచుగా, జెడ్పీ చైర్మన్‌గా, మేయర్‌గా ఎన్ని పదవులు వచ్చినా హుందాతనాన్ని వీడలేదన్నారు. వాసు లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే పనుల కోసం ఆ పార్టీ నా యకుల కాళ్లు పట్టుకోవడం తనకు చేతకాదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున, రామలక్ష్మణ్‌రెడ్డి, చంద్రహాసరెడ్డి, ఆరీఫుల్లా బాష తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement