మంటగలిసిన మానవత్వం
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వం మంటగలిచింది. ఎవరి ఆదరణ లేని ఓ వృద్ధురాలు కిందపడి రోధిస్తున్నా సిబ్బంది చలించని వైనం ఆదివారం వెలుగుచూసింది. స్థానికుల వివరాల మేరకు.. ముద్దనూరు మండలం దేనేపల్లికి చెందిన వృద్ధురాలు హుస్సేన్‌బీకి ఆనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ వెంకటసుబ్బయ్య మూడు రోజుల కిందట ఆమెను శుక్రవారం ప్రొద్దుటూరు ఆస్పత్రిలోని జీఈ వార్డులో చేర్పించాడు. శనివారం మళ్లీ చూసేందుకు రాగా హుసేన్‌బీ బెడ్‌పై కనిపించలేదు. వృద్ధురాలు మరుగు దొడ్డిలో రోధిస్తూ నిస్సహాయస్థితిలో పడి ఉంది. దీనిని చూసి ఆయన చలించిపోయాడు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే అభాగ్యులను ఆదరించాలని, నిర్లక్ష్యంగా వదిలేయడం భావ్యం కాదని ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్‌బాబు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారి వెంట సహాయకులు తప్పని సరిగా ఉండాలన్నారు. హుస్సేన్‌బీని జీఈ వార్డులో చేర్పించగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారన్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని కొందరు వదలి వెళ్తున్నారని, వారి వెంట ఎవరో ఒకరు ఉండాలని తెలిపారు.
ఆస్పత్రి మరుగుదొడ్డిలో నిస్సహాయస్థితిలో వృద్ధురాలు
Comments
Please login to add a commentAdd a comment