ఘనంగా మునయ్యస్వామి తిరునాల
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని అవధూత మునయ్యస్వామి ఆలయంలో సోమవారం తిరునాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తిక మాసం చివరి సోమవారం తిరునాల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం మునయ్య స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే వంటలు వండుకుని బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేశారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించి తలనీలాలు సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ తినుబండారాలు, ఆటవస్తువుల దుకాణాలు, రంగులరాట్నాలు వంటి వాటిలో చిన్నారులు ఆనందోత్సాహాలతో గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment