సవ్యంగా సాగేనా!
ఈసారైనా చర్చ
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్ 7వ తేదీ నిర్వహించిన సమావేశంలో మేయర్‌తో సమానంగా కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే ఆర్. మాధవి పోడియంపై నిల్చొని మాట్లాడేందుకు అవకాశమివ్వాలని అడిగి..నిరంతరాయంగా మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. మొదట ఎజెండాపై చర్చ మొదలు పెట్టి అంశాల వారీగా మాట్లాడాలని ఎమ్మెల్యేకు సూచించినా ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలో అరుపులు, కేకలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మీరు నాకు కుర్చీ వేసేదేంటి..ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ నాకిచ్చారు అంటూ ఎమ్మెల్యే విమర్శలకు దిగారు. అంతకుముందు ఎమ్మెల్యే మాధవి తన నివాసం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్పొరేషన్ కార్యాలయంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు కార్పొరేషన్ కార్యాలయ గేటు వద్ద ఆందోళన చేసి మేయర్‌కు, కార్పొరేటర్లకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. మరికొందరు టీడీపీ నాయకులు సర్వసభ్య సమావేశం ఎదురుగా ఉన్న సమావేశ మందిరంలో తిష్ట వేసి మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. టీడీపీ నాయకులంతా వెళ్లిపోయిన తర్వాత మళ్లీ సమావేశం నిర్వహించేందుకు మేయర్, కార్పొరేటర్లు చేసిన ప్రయత్నాలు పోలీసు, కార్పొరేషన్ అధికారుల తీరుతో విఫలమయ్యాయి.
ఒక్కరు ఉన్నప్పుడే అంత...8 మందితో కలిసి ఇంకెంతో..
ఇదిలా ఉండగా కడప నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన 8 మంది కార్పొరేటర్లు ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీకి ఇదివరకున్న ఏకై క కార్పొరేటర్, ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేలతో కలిపితే వారి బలం 11కు పెరిగినట్లయ్యింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో ఇద్దరు మరణించారు. మిగిలిన 48 మందిలో 9 మంది టీడీపీ, 39 మంది వైఎస్సార్‌సీపీ, ఐదుగురు కో ఆప్షన్ సభ్యులు ఉన్నారు. ఒక్కరు ఉన్నప్పుడే అంత రచ్చ చేసిన ఎమ్మెల్యే మాధవి, 8 మంది కార్పొరేటర్లతో కలిసి మరెంత రభస సృష్టిస్తారోనని అటు కార్పొరేటర్లు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కార్పొరేషన్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వారు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
● ఈసారి సమావేశంలో నగరపాలక అధికారులు 47 అంశాలు ఎజెండాలో పొందుపరిచారు. అందులో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరైన అన్‌టైడ్ గ్రాంట్ రూ.4.76కోట్లు, టైడ్ గ్రాంట్ రూ.7.15కోట్లకు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు పాలకవర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. దీనితోపాటు మరికొన్ని కీలక అంశాలు ఎజెండాలో పొందుపరిచారు. వీటిన్నింటిపై సభ్యులు అర్థవంతమైన చర్చ చేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి పాటుపడతారా లేదా అహంకారానికి పోయి మళ్లీ గొడవ సృష్టిస్తారా వేచి చూడాలి.
నేడు నగరపాలక సర్వసభ్య సమావేశం
కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ మనోజ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు, అన్ని శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment