సీఎం దృష్టికి గండికోట నిర్వాసితుల సమస్యలు
కొండాపురం/జమ్మలమడుగు: గండికోట నిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టును ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జలవనరుల శాఖ సీఈ శ్రీనివాసులు ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డిలతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో 2014–19 లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి మీకందరికి తెలుసు అని అన్నారు. అలాగే పునరావాస కేంద్రాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసికెళ్లి సమస్యలు లేకుండా చేస్తామని నిర్వాసితులతో పేర్కొన్నారు. 2019 –24లో రెండింతల బడ్జెట్ వచ్చినా జగన్ పాలనలో కేవలం 32 వేల కోట్లు కేటాయించారు.అందులో రూ. 19 వేల కోట్లు ఖర్చుపెట్టారు.మిగతావి వారి జేబులోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2500 కోట్లతో టెండర్ పిలిచి ముందుకు పోతున్నామన్నారు. అనంతరం నిర్వాసితుల నుంచి అర్జీలు స్వీకరించారు.అంతకు ముందు జమ్మలమడుగు మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో నిర్మిస్తున్న రోప్‌వేను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గండికోట ముంపు వాసుల సమస్యల పరిష్కారం, నష్టపరిహారం ఇచ్చేందుకు కృషిచేస్తామన్నారు.
● మంత్రి నిమ్మల రామానాయుడు
Comments
Please login to add a commentAdd a comment