విచారణ కమిటీ నియామకం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: డీటీసీ లైంగిక వేధింపులపై కలెక్టర్ విచారణ కమిటీని నియమించారు. ఈ విచారణ కమిటీ సభ్యులుగా జెడ్పీ సీఈవో ఓబుళమ్మ, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీ, అడ్వకేట్ జి. ఉమాదేవి, ఆర్తి హోం పౌండేషన్ చైర్మెన్ పీవీ సంధ్య, జిల్లా పంచాయతీ అధికారి జి. రాజ్యలక్ష్మీ ఉన్నారు. ఈ నెల 5న కలెక్టరేట్‌లోని డి–బ్లాక్‌లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
నేడు ‘ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వ్యవస్థ’
కడప సెవెన్‌రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా అందజేయవచ్చని తెలిపారు.
డయల్ యువర్ కలెక్టర్
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో తెలియజేశారు.
5న జాబ్ మేళా
కడప ఎడ్యుకేషన్: కడప కాగితాలపెంటలోని ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐలో 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు శ్రీకాళహస్తికు చెందిన ఎలక్ట్రోస్టిల్ కాస్టింగ్ లిమిటెడ్, కడపకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, రేణిగుంట అమర్‌రాజాతోపాటు కడప లోని మరిన్ని కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 13 వేల నుంచి రూ. 18 వేల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత మార్కుల జాబితాలు, రెండు ఫొటోలు, ఆధార్‌కార్డు, బయోడేటా, జిరాక్స్ కాపీలతో నేరుగా జాబ్‌మేళాకు హాజరు కావాల ని ఏడీ రత్నరాజు తెలిపారు.
గంగమ్మా..కాపాడమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు గంగరాజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంగమ్మా..అందరూ చల్లగా ఉండేలా కరుణించి కాపాడు తల్లీ అని వేడుకున్నారు.పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్యూ ఆర్ కోడ్‌తో
సులభంగా బిల్లుల చెల్లింపు
కడప కార్పొరేషన్: విద్యుత్ బిల్లులను క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఏపీ ఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎస్.రమణ తెలిపారు. ఆదివారం స్థానిక నెహ్రూనగర్‌లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ బిల్లులు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే విధానంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యుత్ బిల్లుకు డిమాండ్ నోటీస్ కింది భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. దీనిని గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐల ద్వారా స్కాన్ చేసి విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించవచ్చని తెలిపారు. బిల్లులను చెల్లించేందుకు క్యూలైన్లో నిల్చోకుండా, అనధికార వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మోసపోకుండా ఈ విధానం చాలా ఉపయోగపడుతుందన్నారు. క్యూఆర్ కోడ్ ప్రతినెలా మారుతూ ఉంటుందని, ఒకసారి డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మరోసారి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. వినియోగదారులు విద్యుత్ బిల్లులను భద్రపరచుకొని ఏ నెలలో వచ్చిన బిల్లును ఆ నెలలోనే చెల్లించాలని కోరారు. ఏఈ శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment