ఫీజు పోరును జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు ఈనెల 5వ తేదీ నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఫలితంగా లక్షలాది మందికి మేలు జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని, మూడు త్రైమాసికాలుగా 3900 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ఉందన్నారు. దీనివల్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదన్నారు. మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న ఫీజు బకాయిలన్నీ చెల్లించి విద్యార్థులు ఎంత పెద్ద కళాశాలలో చదివిన పూర్తి ఫీజు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, కరీముల్లా యానాదయ్య , జయచంద్రారెడ్డి , యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య విద్యార్థి విభాగం అధ్యక్షుడు పి సాయి దత్త పాల్గొన్నారు.
ఎస్పీకి వినతి
వైఎస్సార్ సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతులు మంజూరు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష, నగర మేయర్ సురేష్‌బాబు, ఇతర నేతలు కోరారు. ఈ మేరకు వారు ఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్ర నాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment