కడపరాయుడితో బంధం పదిలం!
కడప సెవెన్‌రోడ్స్: ఆయన్ను కదిలిస్తే కడప రాయుని గురించిన విశేషాలను పూసగుచ్చుతారు. భారతీయ పురాతన ఆద్వైత వేదాంతానికి సంబంధించిన యోగ వాశిష్ఠం గురించి అలవోకగా వివరిస్తారు. ఆయన చేసేది స్వామి సేవకు వినియోగించే కస్తూరీ సుగంధాది పరిమళ పూజా ద్రవ్యాల వ్యాపారమే. శ్రీ మహావిష్ణు మార్కెటింగ్ పేరిట నిర్వహించే దుకాణం ద్వారా ఏటా వచ్చే ఆదాయంలో పది శాతం కప్పురపు రాయునికి కప్పం పేరిట భక్తి పూర్వకంగా సమర్పించుకుంటారు. చివరికి ఆయన కాలర్‌ట్యూన్ కూడా ‘పొడగంటిమయ్యా మిమ్ను’అని అంటుంది. ఆయనే కడపకు చెందిన కొప్పుగంటి చాన్‌బాషా.
● ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె చాన్‌బాష స్వగ్రామం. ఆయన తండ్రి చిన్న ఖాసింసాహెబ్ 1960వ దశకంలో కడప పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. 1989లో చాన్‌బాషా కడప పీజీ సెంటర్ నుంచి ఎంకాం పట్టా అందుకున్నారు. కొంతకాలం ఎల్‌ఐసీలో పనిచేసిన ఆయన.. పలు కారణాలతో అది మానేసి సైకిల్‌పై వీధివీధి తిరుగుతూ అగరొత్తీలు విక్రయించి జీవనం సాగించేవారు. ఆయన కుమారుడు ఆడిటర్‌గా, కుమార్తె జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కడపలో శ్రీ మహావిష్ణువు మార్కెటింగ్ పేరుతో అగరబత్తీ షాపును నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వీధి వీధిన తిరిగే వ్యాపారం చేసుకుని పొట్టపోసుకున్న తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు కడప రాయుని అనుగ్రహమే కారణమంటారాయన. నిత్యం స్వామి సేవకు వినియోగించే పచ్చ కర్పూరం, పచ్చ కర్పూరం నూనె, లావెండర్ నూనె, మల్లెపూల నూనె, కస్తూరి ధూపాలు, ఒరిజినల్స్ శాండిల్ ధూపాలు, కస్తూరి, జవ్వాది, శాండిల్ తదితర 40 రకాల క్రీములు ఆయన విక్రయిస్తుంటారు.
● తల్లిదండ్రులైన హుసేనమ్మ, చిన్న ఖాసిం సాహెబ్‌ల నుంచి వారసత్వంగా ఆయనకు ఆధ్యాత్మికత అలవడింది. ఆయన తల్లిదండ్రులు తిరుమలలో స్వామికి పెద్ద కల్యాణం జరిపించేవారు. తరుచూ స్వామిని దర్శించేవారు. తల్లి హుసేనమ్మ కై లాస మానస సరోవర యాత్ర కూడా చేయడం విశేషం. దీంతో చాన్‌బాషాకు శ్రీనివాసుడంటే వల్లమాలిన భక్తి ఏర్పడింది. నిరంతరం స్వామికి సంబంధించిన పుస్తక పఠనం, అన్నమాచార్య కీర్తనలు ఆలకిస్తుంటారు. ఓ సారి తిరుమలలో సంపూర్ణ బ్రేక్ దర్శన భాగ్యం కలిగిందని గొప్పగా చెబుతుంటారు. సుమారు అరగంట పాటు స్వామి వారి సన్నిధిలో గడపడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమంటారు. శ్రీమహా విష్ణువు పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నందువల్ల ఏటా ఆదాయంలో 10 శాతం కప్పంగా కడప రాయునికి చెల్లిస్తుంటానని తెలిపారు. అగరబత్తీలు, కస్తూరి, జవ్వాది తదితర పూజా సామాగ్రి రూపంలో స్వామి వారికి సమర్పిస్తుంటామని చెబుతారు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు తరుచుగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడిని కూడా దర్శించుకుంటానని చెప్పారు.
శ్రీ మహావిష్ణు పేరిట పూజా ద్రవ్యాల వ్యాపారం
ఏటా వచ్చే ఆదాయంలో పది శాతం కడప రాయునికి కప్పం
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మికత
ఆదర్శ జీవనాన్ని సాగిస్తున్న చాన్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment