అంధకారంలో డోన్ పల్లెలు
డోన్‌టౌన్: అనుకున్నదే జరిగింది. అసలే అభివృద్ధికి నోచుకోక పల్లెలు సతమతమవుతున్న నేపథ్యంలో గోరుచుట్టుపై రోకటి పోటు అన్నచందంగా డోన్ డివిజన్‌లోని 177 గ్రామాలలోని వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆ గ్రామాలలో అంధకారం అలుముకుంది. కమ్ముకున్న కారుచీకట్లో సంచరించలేని గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. అధిక గ్రామాలలో విద్యుత్‌సరఫరాను నిలిపివేయడం మొట్టమొదటి సారి అని, ఇలాంటి పరిస్థితి తామెప్పుడు చూడలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రూ.6.14 కోట్ల బకాయి..
డోన్ ట్రాన్స్‌కో పరిధిలోని డోన్ మండలంలోని 25 పంచాయతీలు 46 గ్రామాలకు గాను విద్యుత్‌బాకాయి రూ.1.26 కోట్లు, ప్యాపిలిమండలంలోని 26 పంచాయతీలలోని 54 గ్రామాలలోని పంచాయతీ విద్యుత్‌బకాయి రూ.2.63 కోట్లు, వెల్దుర్తి మండలంలోని 22 పంచాయతీలలోని 41 గ్రామాలకు రూ.1.37 కోట్లు, క్రిష్ణగిరి మండలంలోని 15 పంచాయతీలు 36 గ్రామాలకు గాను విద్యుత్ బకాయి రూ.88 లక్షలు వున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ నాయక్ శనివారం విలేకరులకు తెలిపారు.
మేజర్, మైనర్ గ్రామాల విద్యుత్‌బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి జమ చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ దానిపై స్పష్టత రాకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం తలెత్తింది. దీంతో నష్టాల ఊబిలో కూరకుపోయిన ట్రాన్స్‌కో బకాయిల నుంచి బయట పడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మరో 24 గంటల్లో మంచినీటి పథకాలకూ ఇదే దుస్థితి..
అసలు పంచాయతీలకు విద్యుత్‌బకాయిలు గుదిబండగా మారుతుండటంతో ప్రస్తుతం వీధిలైట్లకు, పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో 24 గంటల్లో మంచినీటి పథకాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే వాటికి కూడా విద్యుత్ సరఫరాను నిల్పివేస్తామని ఏడీ నాయక్ హెచ్చరించారు. ఓ వైపు నీటి ఎద్దడి..కరెంటుతో వచ్చే గుక్కెడు నీరు కూడా దొరకదేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ శాఖలు చేస్తున్న నిర్వాకాన్ని అడ్డుకోలేకపోవడం శోచనీయమని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామాలు అంధకారంలో మగ్గిపోవడమే కాకుండా, మంచినీటి దొరకని పరిస్థితి దాపురిస్తుండటంతో ప్రజలు ఆందోళనచెందుతున్నారు.
177 గ్రామాల్లో వెలగని వీధిలైట్లు
Published Sun, Jan 25 2015 2:50 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement