ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగింది | 20 woodcutters from TN gunned by AP police | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగింది

Published Thu, Apr 9 2015 4:14 AM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగింది - Sakshi

ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరిగింది

 మృతుల బంధువుల సమాచారంతో పోలీసుల్లో వణుకు
 సోమవారం మధ్యాహ్నమే అదుపులోకి
 తీసుకున్నారని చెబుతున్న బంధువులు
 సంఘటన సీఎం, ఉన్నతాధికారులకు
 తెలిసే జరిగిందని చర్చ
 ప్రభుత్వం, అధికారుల మల్లగుల్లాలు
 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
 20లో ఇప్పటి వరకు
 19 మృతదేహాల గుర్తింపు
 ఇంకో మృతదేహం సేలం జిల్లాకు చెందిన వ్యక్తిగా భావన
 7 మృతదేహాలు బంధువులకు అప్పగింత
  రుయాలో భారీగా మోహరించిన పోలీసులు
 
 నాబిడ్డను అన్యాయంగా చంపేశారు
 కూలీ పని కోసం వచ్చిన నా బిడ్డను పోలీసులు అన్యాయంగా కాల్చి చంపేశారు. పోలీసుల అరాచకం ఎవరికి చెప్పుకోవాలి. మా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు. దీనికి బాధ్యత ఎవరూ వహిస్తారు?-పద్మ, (మృతిచెందిన కూలీ మునస్వామి తల్లి) మురుగంబాడి, తిరువణ్ణామలై జిల్లా
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి/ కార్పొరేషన్ :శేషాచలం అడవుల్లో ‘ఎర్ర’ కూలీల ఎన్‌కౌంటర్ కథ అడ్డం తిరుగుతోంది. మృతుల బంధువుల సమాచారంతో కొత్త కోణం వెలుగు చూస్తోంది. పోలీసులు చెబుతున్న విషయాలకు, మృతుల బంధువులు చెబుతున్న విషయాలకు పొంతన కుదరడం లేదు. మృతుల బంధువులు మాత్రం సోమవారం ఉదయం ఇంటి నుంచి 8 మంది బయలుదేరారని చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పుత్తూరు వద్ద ఎర్రకూలీలు అనే అనుమానంతో పోలీసులు వారిలో 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని తిరుపతికి పోలీస్ జీపులో తరలించినట్లు బంధువులు పేర్కొంటున్నారు.
 
 అయితే ఓ వ్యక్తి మాత్రం మహిళ పక్కన కూర్చొని ఉండడంతో అతన్ని ఎర్రచందనం కూలీగా గుర్తించలేక పోయి వదలివేశారు. అయితే ఇతను తమ గ్రామానికి చేరుకుని బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తిరుపతికి తరలించారని, ఈ విషయాన్ని తమతో చెప్పారని బంధువులు మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకెళ్లిన వారిని విడిపించుకునేందుకు బంధువులు, స్థానిక పోలీసులు, న్యాయవాదుల  సహాయం తీసుకున్నారు. మంగళవారం వారు అర్బన్ జిల్లా ఎస్పీని కలవాల్సి ఉంది. ఇంతలో ఎర్రచందనం కూలీలు మృతిచెందారని  మీడియాలో వచ్చిన వార్తలకు షాక్ అయ్యారు.
 
 పోలీసులు మాత్రం...
 అయితే పోలీసులు మాత్రం ఎర్ర కూలీలు మంగళవారం ఉదయం
 తమపై రాళ్లు, కత్తులతో దాడి చేశారని ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఎన్‌కౌంటర్ జరిగిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సోమవారం రాత్రి కాల్పుల శబ్దాలు విన్పించాయని చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలు బూటకపు ఎన్‌కౌంటర్ అని ప్రజా, పౌర హక్కుల సంఘాలు, పలు పార్టీల నేతలు చేసిన ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. ఇది సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు ఉన్నతాధికారులకు తెలిసే జరిగిన సంఘటన అని పోలీసు వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. సీఎం సొంత గ్రామం నారావారి పల్లెకు 10 కి.మీ దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. మొత్తం మీద ఈ సంఘటనపై తమిళనాడులో ఆగ్రహం వ్యక్తమౌతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. జరిగిన సంఘటనను మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు అటవీశాఖ ఉన్నతాధికారుల సైతం తిరుపతిలో మకాం వేయడం గమనార్హం.
 
 పోస్టుమార్టం పూర్తి :
 రుయా ఆస్పత్రిలో బుధవారం ఉదయం నుంచి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సాయంత్రానికి ఈ ప్రక్రియ ముగిసింది. 7 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మొదట 6.45 నిమిషాలకు రెండు అంబులెన్స్‌లో 4 మృతదేహాలు, 6.55 నిమిషాలకు ఒక అంబులెన్స్‌లో 2 మృతదేహాలు, 7.20 నిమిషాలకు  1 మృతదేహాన్ని తరలించారు. మృతదేహాలతో పాటు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మొత్తం 20 మృతదేహాల్లో ఇప్పటి వరకు 19 గుర్తించారు. ఇంకో మృతదేహం సేలం జిల్లాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మిగిలిన మృతదేహాలను గురువారం అప్పగించేందుకు జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు.
 
 రుయాలో టెన్షన్... టెన్షన్ :
 మృత దేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో తమిళనాడు, ఆంధ్రాతో పాటు జాతీయ మీడియా మొత్తం ఆసుపత్రి వద్దకు చేరుకుంది. మృతదేహాలను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో చేరుకోవడం, తమిళనాడు నుంచి మృతుల బంధువుల రాకతో మార్చురీ ప్రాంగణం కిక్కిరిసింది. ఒక పక్క పౌరహక్కుల సంఘం, రాజకీయ పార్టీ నాయకుల నిరసనలు, పోలీసులు భారీ స్థాయిలో మోహరింపు, క్షణక్షణం టెన్షన్... టెన్షన్‌కు దారి తీసింది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియక పోలీసులు హైరానా పడ్డారు. ఆఖరికి రోగులు, వారి సహాయకులు మార్చురీ సమీపంలోని చిన్నపిల్లల ఆస్పత్రికి వెళ్లేందుకు వస్తే వారిని అడ్డుకుని వెనక్కి పంపేశారు.
 
 ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కాదు
 శేషాచలం కొండల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కాదు. ఇది కేవలం స్మగ్లర్లు, కూలీలు, పోలీసుల మధ్య వివాదం మాత్రమే. కొందరు రాజకీయ లబ్ధి కోసం ఇరు రాష్ట్రాల మధ్య వివాదం లేపేలా వ్యవహరించడాన్ని మానుకోవాలి. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఇదివరకే ఎర్రచందనం నరికేందుకు రాకూడదని వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, మీడియాల ద్వారా తెలియజేసినప్పటికి ఇక్కడికి కూలీలు వస్తూనే ఉన్నారు. కూలీలు రాకుండా తమిళనాడు రాష్ట్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది.  జాతీయ సంపద రక్షణలో భాగంగానే ఎన్‌కౌంటర్ జరిగింది. విధి నిర్వహణలో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో కూలీలు మృతిచెందారు.  ఇది బాధాకరమైనప్పటికీ న్యాయ విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేలే వరకు ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు.
 -చలసాని శ్రీనివాసులు, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు
 
 కూలీలను చంపడం దారుణం
 శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో 20 మంది నిరుపేద కూలీలను పోలీసులు కాల్చి చంపడం దారుణం. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఎన్‌కౌంటర్ జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోంది. కూలీలను తీసుకొచ్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. అయితే కూలీలను చంపే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
 -కె.నారాయణ స్వామి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే
 
 
 బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
 రుయా మార్చురీ వద్ద తమిళ పౌర సంఘం నేతలు, మధురై పీపుల్స్ వాచ్ ప్రతినిధులు ఆందోళనకు దిగాయి. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొనేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని, బూటకపు ఎన్‌కౌంటర్‌తో అమాయక తమిళ ప్రజలను పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విచారణ కమిటీ నియమించి ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని,  మానవ హక్కుల కమిషన్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ చర్యను ముక్తకంఠంతో తమిళులు ఖండిస్తున్నారు.
 
 ఇది దురదృష్టకరం
 పోలీసుల కాల్పుల్లో ఎర్రచందనం కూలీలు మృతి చెందడం దురదృష్టకరం.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయ సంపదను రక్షించుకునేందుకు, కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టపోకూడదని పటిష్ట కార్యాచరణ వ్యవస్థ రూపొందించింది. ఇందులో భాగంగానే కూంబింగ్ నిర్వహించేప్పుడు పోలీసులపై కూలీలు దాడి చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో పోలీసులపై కూలీలు దాడి చేయడంతో అధికారులు మృతి చెందారు. ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు.
 -సుగుణమ్మ, ఎమ్మెల్యే, తిరుపతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement