తుని రూరల్, న్యూస్‌లైన్ : కౌంటర్లో కూర్చుంటే చాలు కాసులు వాటంతట అవే రాలుతాయి. అందుకే ఎంత రిస్క్ అయినా పట్టించుకోకుండా అక్కడి సిబ్బంది తమ ‘పని’ కానిచ్చేస్తుంటారు. లక్షలాది రూపాయలు జేబుల్లో నింపుకొంటారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. వారి తీరు మాత్రం మారడం లేదు. అందుకే వారు మామూలోళ్లు కాదు.. కచ్చితంగా ‘మామూలోళ్లు’.
తుని మండలం తేటగుంట శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) చెక్‌పోస్ట్‌పై జరిగిన ఏసీబీ దాడుల్లో అక్రమ వసూళ్ల సొమ్ముతో ఇద్దరు, ముగ్గురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు దొరికిపోయిన సంఘటనలున్నాయి. మామూళ్ల పేరుతో అక్రమ దందా కొనసాగుతుందన్న ఫిర్యాదులు నిత్యం అందుతున్న నేపథ్యంలో తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఏలూరులోని ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడి చేశారు.
వారం రోజుల వ్యవధిలో ఈ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు రెండోసారి దాడి చేయగా, రెండున్నరేళ్లలో ఇది నాలుగోసారి. వెనువెంటనే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడం చెక్‌పోస్ట్ ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ నెల 21న (శనివారం) రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. తాజాగా ఆదివారం రెండోసారి ఏలూరుకు చెందిన ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఐదుగురు సీఐలు దాడిలో పాల్గొన్నారు. మొత్తం రూ.1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాత్రి ఒంటి గంటకు చెక్‌పోస్ట్‌పై దాడి చేశామన్నారు. ఆ సమయంలో డ్యూటీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు(ఏఎంవీఐ)లు సత్యనారాయణ ప్రసాద్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, చిన్నారావు ఉన్నారన్నారు. వీరితో పాటు ఏఎంవీఐ డ్రైవర్, మరో ప్రైవేట్ వ్యక్తి అక్కడే ఉన్నారు. ఏఎంవీఐ డ్రైవర్ వద్ద రూ.23 వేలు, కానిస్టేబుల్ వద్ద రూ.7,300, ప్రైవేట్ వ్యక్తి వద్ద రూ.3,700 స్వాధీనం చేసుకున్నామన్నారు.
కౌంటర్‌లో కూర్చొని..
రాత్రి రెండు గంటల నుంచి చెక్‌పోస్ట్‌లో సిబ్బందిని కౌంటర్ నుంచి పక్కన పెట్టినట్టు డీఎస్పీ తెలిపారు. వారి స్థానే ఏసీబీ సీఐలను కూర్చోబెట్టామన్నారు. అప్పటినుంచి ఉదయం 8 గంటల వరకు చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే వాహనదారులు రికార్టులు చూపించేందుకు వచ్చి, స్వచ్ఛందంగానే మామూళ్లు ఇచ్చి వెళ్లారని వివరించారు. అలా మొత్తం రూ.91 వేలు సమకూరిందన్నారు. చెక్‌పోస్ట్‌లో మొత్తం రూ.1.25 లక్షలను సీజ్ చేశామన్నారు. ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, డ్రైవర్, ప్రైవేట్ వ్యక్తిని విచారిస్తున్నామని, ఈ నివేదికను ఏసీబీ డీజీకి అందజేస్తామన్నారు. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మామూళ్ల మత్తులోనే..
ఈ అక్రమ వసూళ్లన్నీ మామూళ్ల మత్తులోనే సాగుతున్నట్టు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. ఇదే విషయాన్ని మామూళ్లు ఇచ్చిన వాహనదారుల నుంచి వివరాలు సేకరించి, రికార్డు చేశామన్నారు. మామూళ్లు ఇవ్వకపోతే ఏదో ఒక కారణంతో వాహనాలను నిలిపివేస్తారని, అందువల్లే తాము స్వచ్ఛందంగా మామూళ్లు ఇస్తున్నట్టు వాహనదారులు చెప్పారన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు విల్సన్, కొమరయ్య (ఏలూరు), రాజశేఖర్, సంజీవరావు (రాజమండ్రి), ఎంవీ గణేష్ (విశాఖపట్నం) పాల్గొన్నారు.
వీళ్లు మామూలోళ్లే..
Published Mon, Dec 30 2013 1:09 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement