సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ సాంకేతిక సంస్థలు ఐఐటీ–చెన్నై, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ, ఎన్‌డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతిలో 71 శాతం ప్రాంతానికి వరద ముప్పు ఉందని ఐఐటీ–చెన్నై స్పష్టం చేసింది. ఆ ప్రాంత వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని అగ్నిగుండంగా మారుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ వెల్లడించింది. సెస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్న ఈ ప్రాంతం భారీ భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనువైనది కాదని ఎన్‌డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదిక తేల్చి చెప్పింది. నివేదికల్లో ఆ సంస్థలు ఏం చెప్పాయంటే..
వరదొస్తే ముప్పే : ఐఐటీ–చెన్నై
రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)–చెన్నై తేల్చిచెప్పింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులకు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి, 71 శాతం ప్రాంతాలను ముంచెత్తుతుందని వెల్లడించింది. కృష్ణా నది, కొండవీటి వాగులకు ఒకేసారి వరద వస్తే రాజధాని గ్రామాల్లో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీరు ముంచెత్తుతుందని స్పష్టం చేసింది. ముంపు బారినుంచి రక్షించడానికి రాజధాని ప్రాంతంలోని భూములను 3 నుంచి 4 మీటర్ల ఎత్తున మట్టిపోసి అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొనడాన్ని ఎత్తిచూపింది.
నల్లరేగడి భూములు కావడం, రెండున్నర నుంచి 5 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యం కావడం వల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణాల వ్యయం అధికమవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ పనులు చేపట్టిన ప్రాంతాలపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి రాఫ్ట్ ఫౌండేషన్ (పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్ వేయడం)కు పనికి రాదని స్పష్టం చేసింది. రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగానీ రాతి పొర తగలదని, ఈ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్ ఫౌండేషన్ (రిగ్‌ల ద్వారా 40 మీటర్ల లోతుకు పిల్లర్లను దించి.. అక్కడి నుంచి కాంక్రీట్ వేయడం) అవసరమని తేల్చింది. పైల్ పౌండేషన్ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని.. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుందని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని విస్పష్టంగా తేల్చి చెప్పింది.
ఆ ప్రాంతం అగ్నిగుండమే : సీఈఈడబ్ల్యూ
బహుళ పంటలు పండే భూముల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండర్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 1.20 లక్షల జనాభా ఉంది. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 2050 నాటికి రాజధాని ప్రాంతంలో జనాభా 3.58 మిలియన్లకు చేరుకుంటుంది. పెరిగే జనాభా మేరకు నివాసం ఉండటానికి గృహాలు, రహదారులు, రైలు మార్గాలు నిర్మించాలి. గృహాల నిర్మాణంలో వినియోగించే స్టీలు, సిమెంటు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమినస్ (బీటీ), ప్రజలు వినియోగించే ఏసీ (ఎయిర్ కండిషనర్ల)ల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని విశ్లేషించింది.
పర్యవసానంగా 2050 నాటికి ఉష్ణోగ్రత 3.7 డిగ్రీల మేర పెరుగుతుందని స్పష్టం చేసింది. 2030 నాటికి 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సాధారణంగా 30–42 డిగ్రీల మధ్య ఉష్ణోత్రలు నమోదవుతున్నాయి. మే 10, 2002న గరిష్టంగా 48.8 డిగ్రీలు, ఫిబ్రవరి 4, 2017న కనిష్టంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని ప్రాంతంలో 2050 నాటికి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటే అవకాశం ఉంటుందని స్పష్టీకరించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 15. రాజధాని ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 52కు పెరగుతాయని.. అంటే అమరావతి అగ్నిగుండమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అధిక ఉష్ణోగ్రతల వల్ల అకాల వర్షాలు, కుండపోత వానలు పడటం వల్ల కొండవీటి వాగు, కృష్ణా నది ఉప్పొంగి రాజధాని ప్రాంతాన్ని వరదలతో ముంచెత్తుతాయని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కేవలం 0.5 డిగ్రీలు పెరగడంతో 2018లో జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. పంటల దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలు పెరిగితే జన జీవనం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉష్ణ తీవ్రత ఉండే రోజులు 52కు పెరిగితే వడగాల్పుల వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆకాశ హార్మ్యాలకు అనుకూలం కాదు : ఎన్‌డీఎంఏ–ఐఐఐటీ
విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా (ఫాల్ట్ జోన్స్) ఉండటం.. ఈ పొరలలో కంపనాల తీవ్రత 9–10 హెర్డ్›్జలు ఉండటం వల్ల భూకంపాల ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఎన్‌డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ), ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) హైదరాబాద్ తేల్చింది.
రాజధాని ప్రాంతం 50 అంతస్తుల భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని ఆ సంస్థల ఉమ్మడి అధ్యయన నివేదిక స్పష్టం చేస్తోంది. సెస్మిక్ జోన్ (భూకంప ప్రభావిత ప్రాంతం) 3లో విజయవాడ ఉండటం వల్ల భూకంపాలు వస్తే ఆకాశహార్మ్యాల వల్ల ప్రాణనష్టం భారీగా ఉంటుందని హెచ్చరించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 1861 నుంచి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే సుమారు 170 సార్లు భూకంపాలు, ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7 నుంచి 6 మ్యాగ్నిట్యూడ్‌ల వరకూ నమోదైంది. భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్‌పై 6 మ్యాగ్నిట్యూడ్‌లకు మించి తీవ్రత నమోదైతే.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన బహుళ అంతస్తుల్లో 80 శాతం కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment