ఓ అపార్ట్‌మెంట్‌లోని హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు (ఫైల్)
అనంతపురం క్రైం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కట్టడికి జిల్లా పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పాజిటివ్ కాంటాక్ట్ ట్రేసింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్రంలోనే పేరుపొందారు. డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ కూడా ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు. కరోనా బారిన పడిన వారికి వైద్యులు, స్టాఫ్‌నర్సులు సేవలందిస్తుంటే... వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా పోలీసులు అనుక్షణం పాటుపడుతున్నారు.
వేగంగా కాంటాక్ట్‌ల సేకరణ
ఈ ఏడాది మార్చి 29న జిల్లాలో మొదటగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ప్రణాళిక ప్రకారం సిబ్బందికి సూచనలందించారు. 4 వేల మంది పోలీసులు లాక్‌డౌన్, కాంటాక్ట్ ట్రేసింగ్‌లో శ్రమించారు. అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో రెండు టెక్నికల్ బృందాలతో పాటు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు వివిధ బృందాలుగా ఏర్పాటు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారు 14 రోజుల పాటు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారని ఆరా తీయడంతో పాటు బాధితుల సెల్‌నంబర్ తీసుకుని వివిధ నెట్‌వర్క్‌ల నుంచి కాల్ డీటైల్ రికార్డు (సీడీఆర్) లొకాలిటీ సేకరించారు. దాని ఆధారంగా ఇప్పటి వరకు నమోదైన 54 కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి 985 మంది ప్రైమరీ కాంటాక్ట్, 1451 సెకండరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరించి క్వారన్‌టైన్‌కు తరలించారు. పాజిటివ్ అని తేలితే వారిని 108 సహాయంతో కోవిడ్ ఆస్పత్రులు, ఐసోలేషన్‌లకు ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకుంటారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తంగా 4,710 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో 1451 సెకండరీ కాంటాక్ట్‌లను హోం క్వారంటైన్‌లో ఉంచారు. మిగతా వారు క్వారంటైన్‌లలో ఉంచి కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అందులో 1,075 ఫారెన్ రిటర్న్స్ ఉన్నారు.
ప్రణాళికతోనే సత్ఫలితాలు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంటాక్ట్ ట్రేసింగ్‌ను విజయవంతం చేశాం. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను త్వరగా చేపడితేనే వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవచ్చు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌లు గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆ విధంగా వేల సంఖ్యలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి కోవిడ్ ఆస్పత్రులు, క్వారన్‌టైన్‌లకు తరలించాం. పక్కా ప్రణాళికతోనే సత్ఫలితాలు సాధిస్తున్నాం.
– సత్యయేసుబాబు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment