టెస్టుల్లో ఏపీ ఫస్ట్‌ | Andhra Pradesh bags top place in Covid-19 tests in India | Sakshi
Sakshi News home page

టెస్టుల్లో ఏపీ ఫస్ట్‌

Published Thu, Apr 23 2020 3:25 AM | Last Updated on Thu, Apr 23 2020 8:49 AM

Andhra Pradesh bags top place in Covid-19 tests in India - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోవిడ్‌–19 పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిర్ధారణ టెస్ట్‌ల గణాంకాలు చూస్తే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశంలో పది లక్షల మంది జనాభాకు సగటున 334 టెస్టులు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ 830 టెస్ట్‌లు చేసింది. నాలుగు రోజులుగా రాజస్థాన్‌.. ఏపీ ఎక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తూ వచ్చాయి. వారం రోజుల క్రితం 5వ స్థానంలో ఉన్న ఏపీ.. టెస్ట్‌ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని మొదటి స్థానానికి చేరుకుంది. పది లక్షల మంది జనాభాకు 809 టెస్ట్‌లతో రాజస్థాన్‌ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. 781 టెస్ట్‌లతో తమిళనాడు రాష్ట్రం 3వ స్థానంలో, 665 టెస్ట్‌లతో మహారాష్ట్ర 4వ స్థానంలో, 604 టెస్ట్‌లతో గుజరాత్‌ 5వ స్థానంలో నిలిచాయి. 

అందుబాటులోకి క్లియా మెషీన్లు 
– రాష్ట్రంలో ఫిబ్రవరి నాటికి ఒకే ఒక వైరాలజీ ల్యాబొరేటరీ అందుబాటులో ఉండగా ఇప్పుడా సంఖ్య 9కి పెరిగింది. 225 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా టెస్ట్‌లు చేస్తున్నారు. 
– ఇవికాక ఇప్పుడు 5 క్లియా మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించిన రసాయనాలు బుధవారం రాష్ట్రానికి చేరాయి. ఒక్కో మెషీన్‌ నుంచి గరిష్టంగా రోజుకు వెయ్యి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంది. 
– దీంతో టెస్ట్‌ల సామర్థ్యం మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అధికారులు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారన్నారు.

రికార్డు స్థాయిలో పరీక్షలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని, మంగళవారం ఒక్క రోజే 5,757 పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.

క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ పరీక్షలు
ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న 7,587 మందికి పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐసీయూ బెడ్లను పెంచాలని, అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. 
 
కొరియా ర్యాపిడ్‌ కిట్ల పనితీరు సంతృప్తికరం
– మన రాష్ట్రానికి రాజస్థాన్‌ తరహా చైనా కిట్స్‌ను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకు వచ్చారని అధికారులు సీఎంకు తెలిపారు. కొన్ని కిట్లను చెక్‌ చేసి చూశామన్నారు. 
– ఇదివరకే పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను, నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను ఆ కిట్స్‌ ద్వారా పరీక్షిస్తే ఫలితాలు సంతృప్తి కరంగా లేనందున ముందుకు వెళ్లలేదన్నారు. 
– దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను కొరియా నుంచి తెప్పించుకున్నామని చెప్పారు.  అమెరికాకు వెళ్లాల్సిన ఈ కిట్లను.. అతి కష్టంపై చార్టర్‌ విమానం ద్వారా తెప్పించుకున్నామన్నారు. 
– ఇప్పటికి 5 నుంచి 6 వేల శాంపిళ్లను పరిశీలించామని, మంచి పనితీరు కనబరుస్తున్నాయని సీఎంకు వివరించారు.

వైద్య విధానంలో మెరుగైన పద్ధతులు
– కోవిడ్‌–19 రోగులకు వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వైద్య విధానాలపై నిరంతర అధ్యయనం, పరిశీలన చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. కోవిడ్‌ సోకిన రోగికి నిరంతరం ఆక్సిజన్‌ లెవల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు.
– రోగులకు పల్స్‌ ఆక్సీ మీటర్లు పెడుతున్నామని, వీటిని మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రతి 6 గంటలకు ఒకసారి ఆక్సిజన్‌ లెవల్‌ చెక్‌ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోగికీ కేస్‌ షీట్‌ తయారు చేస్తున్నామన్నారు.
– కోవిడ్‌ సోకిన రోగికి అందించాల్సిన వైద్య విధానంపై స్డాండర్డ్‌ ప్రొటోకాల్‌ కూడా పెడుతున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రులే కాకుండా జిల్లాల్లో ప్రథమంగా గుర్తించిన ఆస్పత్రులతో కలిపి మొత్తం 18 ఆస్పత్రుల్లో ఈ ప్రోటోకాల్‌ అమలయ్యేలా చూస్తున్నామని సీఎంకు వివరించారు.
– వైద్యులకు తగిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రతి కోవిడ్‌ ఆసుపత్రిలో వైరస్‌ లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైరస్‌ను నిర్ధారించేలా ఒక ట్రూనాట్‌ మిషన్‌ను పెడుతున్నామన్నారు. దీనివల్ల 2 గంటల్లోగా ఫలితం వస్తుందని, తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. 

నిరంతర పర్యవేక్షణ
– పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ఎంత వరకు వచ్చిందని సీఎం ప్రశ్నించగా, అది అమలులో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. 
– ఆక్సిజన్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, వీలైనన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చూసుకోవాలని సీఎం సూచించారు. 
– 300 మంది వైద్యులు పని చేస్తున్న టెలీ మెడిసిన్‌ ద్వారా మంచి సేవలు అందించాలని సీఎం ఆదేశించారు.  టెలి మెడిసిన్‌లో కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా, మందులు కూడా పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. శనివారంలోగా దీన్ని కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement