సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, సామాజిక పింఛన్ల కోసం వేజ్ అండ్ మీన్స్(చేబదుళ్లు), ఓవర్ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు చేస్తే గానీ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులను 20 సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒకే నెలలో ఏకంగా రూ.5,000 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏనాడూ తీసుకురాలేదు.
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ ఏప్రిల్ 16వ తేదీన మరో రూ.1,000 కోట్ల అప్పు చేసేందుకు సన్నద్ధమైంది. అయితే, ఆర్‌బీఐ ఇందుకు ఒప్పుకోలేదు. నాలుగు నెలల కోసం రూ.8,000 కోట్ల అప్పునకు అనుమతిస్తే, ఒకే నెలలో రూ.5,000 కోట్ల అప్పులు చేసి, వెంటనే మరో రూ.1,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నెలకు రూ.2,000 చొప్పున మాత్రమే ఓపెన్ మార్కెట్‌లో అప్పునకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. దాంతో వచ్చే నెలలోనే రూ.2,000 కోట్ల అప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు చెల్లించి, వచ్చే నెలలో అప్పు చేయడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్‌ను అధిగమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
అత్యవసరాలకు సర్కారు మొండి చెయ్యి
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఈ నెల 24వ తేదీన రూ.2,300 కోట్లు వచ్చాయి. ప్రాధాన్యతా క్రమంలోనే అత్యవసరాలకు మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. కానీ, అత్యవసరాల ముసుగులో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సూచించిన బిల్లులను మాత్రమే ఆర్థిక శాఖ కార్యదర్శి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ద్వారా అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, వేసవిలో తాగునీటి సరఫరా తదితర అవసరాల కోసం వెచ్చించాల్సిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంతో ప్రస్తుతం ఖజానా ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ఇతరుల దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి తలెత్తింది.
సీఎం డ్యాష్‌బోర్డు నుంచి వివరాలు మాయం
కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడేం జరుతోందో క్షణాల్లో తనకు తెలిసిపోతుందని, పూర్తి పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఊదరగొడుతుంటారు. ఏ శాఖలో ఎలాంటి సమాచారం అయినా కోర్ డ్యాష్‌బోర్డులో ఉంటుందని చెబుతుంటారు. అయితే, సీఎం డ్యాష్‌బోర్డు నుంచి ఆర్థిక శాఖకు చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను తాజాగా తొలగించడం గమనార్హం. ఆర్థిక శాఖ ఆదాయ, వ్యయాల సమాచారాన్ని కనిపించకుండా చేశారు. ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది? ఏ రంగానికి ఎంత వ్యయం చేశారు? అనే వివరాలు సీఎం డ్యాష్‌బోర్డులో ఏడాదిన్నర క్రితం వరకూ ఉన్నాయి. తర్వాత ఆ వివరాలను మాయం చేశారు. ఆ సైట్ ఓపెన్ చేస్తే తాత్కాలికంగా మూసివేసినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment