వాహనాల నల్ల అద్దాల మాటున చట్టవ్యతిరేక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ కార్ల నుంచి ఖరీదైన కార్లలో పలువురు నేరాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మద్యం అక్రమ రవాణా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, వ్యభిచారం, కిడ్నాప్‌లు, దొంగతనాలు, సెటిల్మెంట్లు, అవినీతి తదితర నేరాలకు బ్లాక్‌ఫిల్మ్ వేసిన కార్లు కీలకంగా మారాయి. ఇటీవల విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ కేసు విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు, రవాణా అధికారులు బ్లాక్ ఫిల్మ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే జిల్లాలో అధికారులు మాత్రం ఈ విషయంలో ఇంకా మేలుకోలేదు.
నెల్లూరు (టౌన్) : జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని వాహనాల తనిఖీల్లో వెనుకబడింది. ఆ శాఖ రూపొందించిన నిబంధనలతోపాటు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,26,095 కార్లున్నాయి. వీటిలో 1.19 లక్షల సొంత కార్లు ఉండగా, 7,095 మోటార్ క్యాబ్‌లున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కారు తయారీలోనే ప్రింటింగ్ గ్లాస్‌కు 30శాతం ఉన్న ఫిల్మ్‌ను ఆయా కంపెనీల యాజమాన్యాలు బిగిస్తున్నాయి. ఆ తర్వాత కారు సైడ్ డోర్, వెనుక భాగంలో ఉన్న గ్లాసులకు ఎలాంటి ఫిల్మ్‌లు బిగించకూడదు. దేశంలో అల్లర్లు, కిడ్నాప్‌లు, హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టాన్ని అమలు చేయాలని 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ చట్టం ప్రకారం కారుకు ఎలాంటి ఫిల్మ్ బిగించకూడదు. ముప్పు ఉన్న వారు, వీఐపీలు తగిన కారణాలు చూపి పోలీసుల అనుమతితో బ్లాక్‌ఫిల్మ్‌ను ఉపయోగించుకోచ్చని సూచించింది.
యథేచ్ఛగా వినియోగం
ఇటీవలి కాలంలో కార్లకు యథేచ్ఛగా బ్లాక్ ఫిల్మ్‌ను వినియోగిస్తున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తులు బయటకు స్పష్టంగా కనపడాలి. అయితే కొంతమంది కారు లోపలి భాగం కనపడకుండా ఫుల్‌బ్లాక్ ఫిల్మ్‌ను వినియోగిస్తున్నారు. జిల్లాలో ఎర్రచందనం, మద్యం అక్రమరవాణా, స్మగ్లింగ్, దొంగతనాలు, కిడ్నాప్‌లు, గంజాయి, వ్యభిచారం, సెటిల్‌మెంట్లు జోరుగా జరుగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
తనిఖీలు నిల్
బ్లాక్‌ఫిల్మ్ వినియోగంపై ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. గతంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌పైకొద్దిరోజులు హడావుడి చేసిన పోలీసు, రవాణా అధికారులు ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌తో పెద్ద మొత్తంలో కార్లు కనపడుతున్నాయి. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రోజూ వందలాది వాహనాలు వస్తుంటాయి. జిల్లాలో మెజార్టీ కార్లు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌లు తగిలించి యథేచ్ఛగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో బ్లాక్‌ఫిల్మ్‌తో తిరుగుతున్న కార్లపై తనిఖీలు నిర్వహించి వాటిని తొలగించి కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.
తనిఖీలు నిర్వహిస్తాం
కరోనా కారణంగా వాహనాలను తనిఖీ చేయలేకపోయాం. వాహనాలకు కంపెనీల నుంచి ఏ ఫిల్మ్ వస్తుందో దాన్నే ఉంచాలి. వాటిని మార్చి బ్లాక్‌ఫిల్మ్‌లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీ నిర్వహించి అపరాధ రుసుమును విధిస్తాం. బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగిస్తాం. – సుబ్బారావు, డీటీసీ నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment